
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
● జిల్లా పరిషత్ చైర్మన్
మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం: పవిత్ర రంజాన్ సందర్భంగా అల్లాహ్ తన కరుణతో అందరినీ దీవించాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను)ఆకాంక్షించారు. అందరికీ ఆరోగ్యం, శ్రేయస్సు, ప్రశాంతత లభించాలని కోరారు. రంజాన్ మాసం జీవితాల్లో వెలుగులు నింపాలనీ, ప్రేమ, శాంతి, సామరస్యాన్ని అందించాలనీ ఆకాంక్షించా రు. సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో మన హృదయాలను శుద్ధి చేసుకోవాలని, విజయానికి మార్గం సుగమం కావాల ని ఆయన అభిలషించారు.
ఈకేవైసీ గడువు పెంపు
పార్వతీపురం: జిల్లాలో రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచింది. ఈ మేరకు ఏప్రిల్ నెలాఖరు వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ పంపిణీ పటిష్టంగా అమలు చేసేందుకు కార్డులో ఉన్న సభ్యులందరికీ ఈకేవైసీ ఉండాలని పేర్కొంది. ఈ మేరకు రేషన్ దుకాణాల వద్ద డీలర్లు ఈకేవైసీ చేపట్టారు. జిల్లాలో 15 మండలాల్లో 8,23,638 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉండగా ఇంకా 80 వేల మంది వరకు ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
‘పైడితల్లి’కి ఉగాది శోభ
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం ఆదివారం ఉగాది శోభను సంతరించుకుంది. ఆలయ ఇంచార్జ్ ఈఓ కెఎన్‌విడివి.ప్రసాద్ నేత్రత్వంలో అమ్మవారికి పుష్పాలంకరణలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం అమ్మవారికి బూరెలతో నివేదన చేశారు. ఆలయమంతా పుష్పాలతోనూ, యాపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లతో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం ఉగాది పర్వదినం పురస్కరించుకుని వేదపండితులను ఘనంగా సత్కరించి వారికి నగదు పురస్కారాలను అందజేశారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి ఆవరణలో అమ్మవారికి నేతేటి ప్రశాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో వేదపండితులు రాళ్లపల్లి రామసుబ్బారావు పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమంలో వేదపండితులు దూసి శివప్రసాద్, తాతా రాజేష్, సాయికిరణ్, నరసింహమూర్తి, దూసి కృష్ణమూర్తిలు సహకార మందించారు.
రామతీర్థానికి శ్రీరామనవమి శోభ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీ రామస్వామి వారి దేవస్థానానికి శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నుంచి కల్యాణ వసంతోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున స్వామి కి సుప్రభాత సేవ, బాలభోగం తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలోనికి స్వామివారిని వేచింపజేసి విశ్వక్సేరాధన, అంకురారోపణ, ఋత్విగ్వరణం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సుమారు 40 మంది ఋత్విక్కులచే ఈ నెల 6వ తేదీ వరకు శ్రీమద్రామాయణ, సుందరకాండ, సహస్ర నామ తులసీ దళార్చన, కుంకుమార్చనలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆ రోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని వేడుకగా జరిపించనున్నారు.
వేద రుత్విక్కులచే పారాయణాలు
స్వామివారి ఆస్థాన మండపం వద్ద వివిధ ప్రాంతా ల నుంచి విచ్చేసిన రుత్విక్కులచే శ్రీమద్రామయణం, సుందరకాండ పారాయణాలు, సుదర్శన శతకం, నాలాయర దివ్య ప్రబంధ, తులసీ దళార్చన, కుంకుమార్చన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం యాగశాలలో సుందరాకాండ, గాయత్రీ రామాయణాలు, సుదర్శన శతకం హోమాలను నిర్వహించి అగ్నిప్రతిష్టాపనను గావించారు. రాత్రి 7గంటలకు స్వామివారిని రామతీర్థం తిరువీధుల్లో ఊరేగించారు. ఈఓ వై.శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు పాల్గొన్నారు.

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు