
వీఆర్‌ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించండి
● అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత
విజయనగరం గంటస్తంభం: వీఆర్‌ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.గురుమూర్తి కోరారు. వీఆర్‌ఏలకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు వీఆర్‌ఏలు స్థానిక కలెక్టరేట్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామ రెవెన్యూ సహాయకులుగా పైకి విధులు నిర్వహిస్తున్నా వారు అంతర్గతంగా ఆఫీస్ కార్యాలయాల్లో అటెండర్లుగా, స్వీపర్లుగా, డ్రైవర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారన్నారు. అటువంటి వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. అలాగే అర్హులైన వారికి ప్రమోషన్, నైట్‌డ్యూటీల రద్దు, జీతంతో కలిపి డీఏలు, భూసర్వేల సందర్భంగా టీఏ, డీఏలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్, ప్రసాద్, పైడిరాజు, సన్యాసప్పుడు, రామప్పుడు, జయరావు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.