
పౌల్ట్రీ పరిశ్రమ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
● పరిశ్రమ నుంచి ఎమ్మెల్యే
కార్యాలయం వరకు పాదయాత్ర
● పోస్టర్లు విడుదల చేసిన సీఐటీయూ నాయకులు
చీపురుపల్లి: నిబంధనలకు విరుద్ధంగా మండలంలోని కర్లాం శ్రీ వెంకటరామా పౌల్ట్రీ పరిశ్రమలో తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని సీఐటీయూ నాయకులు స్పష్టం చేశారు. గడిచిన 40 రోజులుగా కార్మికులు నిర్వహిస్తున్న నిరసనలో భాగంగా బుధవారం పౌల్ట్రీ పరిశ్రమ నుంచి చీపురుపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయం వరకు నిర్వహించ తలపెట్టిన సామూహిక పాదయాత్రకు సంబంధించిన పోస్టర్లను పరిశ్రమ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌల్ట్రీ పరిశ్రమలో అక్రమంగా తొలగించిన కార్మికులందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కార్మికశాఖ డిప్యూటీ కమీషనర్ ఆదేశాలు కూడా ఉన్నాయని అయినప్పటికీ యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తోందన్నారు. అంతేకాకుండా పరిశ్రమలో స్థానికులకే 75 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున కార్మికులను తీసుకొచ్చి నియమించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. అందులో భాగంగానే బుధవారం ఉదయం పరిశ్రమ నుంచి కార్మికులంతా ఒక్కటై పాదయాత్రగా బయల్దేరి చీపురుపల్లిలోని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కార్యాలయం వరకు పాదయాత్రగా నిరసన తెలుపుతూ వెళ్లనున్నట్లు తెలిపారు. కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ తలపెట్టిన ఈ పాదయాత్రకు ప్రజలు, ప్రజాప్రతినిధులు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులతో బాటు యూనియన్ నాయకులు టీవీ.రమణ, ఎ.గౌరునాయుడు, ఐ.గురునాయుడు, టి.ఈశ్వరరావు, సూరిబాబు, గొల్లబాబు తదితరులు పాల్గొన్నారు.