
నాణ్యత తేలిపోయింది!
గిరిజన గ్రామాల ప్రజలు అమాయకులు... మారుమూల కొండప్రాంతం.. ఇక్కడ నాసిరకం పనులు చేసినా అడిగేవారు ఉండరన్న భావనతో కురుపాం మండలంలోని అంటిజోల గ్రామం నుంచి మనిగ గ్రామానికి 2.3 కిలోమీటర్ల మేర రూ.157.65 లక్షల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిచ్చేశారు. మట్టిపైనే తారురోడ్డు వేసి మమఅనిపించేశారు. రోడ్డుపై వాహనం వెళ్తే చాలు.. టైర్లకు తారు పెచ్చులు అంటుకుంటున్నాయి. ఎక్కడికక్కడే రోడ్డు ఎక్కిపోతోంది. వేసిన 20 రోజులకే నాణ్యత ‘తేలిపోయింది’. రోడ్డు పనుల్లో ‘డొల్ల’తనం బయటపడుతోందన్న విషయాన్ని పలువురు యువకులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. రూ.కోట్లు వెచ్చించి.. రహదారులు కల్పిస్తున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వం.. నాణ్యతకు పాతరేసి, కాంట్రాక్టర్లకు అప్పనంగా కాసులు కట్టబెడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంపై గిరిజనులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ వేసిన రోడ్డును చూడండంటూ ప్రయాణికులకు చూపిస్తున్నారు. దీనిని గుర్తించిన అధికారులు మళ్లీ ఉమ్ముతడి పనులు మొదలుపెట్టారు. వాస్తవంగా శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. కూటమి నాయకుల కమీషన్ కక్కుర్తి వల్లే గిరిజన ప్రాంతాల రహదారులకు ఈ దుస్థితి ఏర్పడిందని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గుంతలు లేని రహదారులు.. గిరి శిఖర గ్రామాలకు డోలీల కష్టాలు తీరుస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలైతే చేస్తున్నారు గానీ.. ఆచరణలో కూటమి నాయకుల నాణ్యతలేమి పనితీరుకు ఈ రోడ్డే నిలువెత్తు నిదర్శనమని విమర్శిస్తున్నారు.
– సాక్షి, పార్వతీపురం మన్యం

నాణ్యత తేలిపోయింది!