
బడికి వెళ్లాలన్నా.. మూడు కిలోమీటర్లు నడవాల్సిందే
●గంగాపురం పంచాయతీ తాన్నవలస, తొక్కుడవలస, తొక్కుడవలస కొత్తపాకలు గిరిజన గ్రామాలకు పాఠశాలలు కూడా లేవు. ఇక్కడ చదువుకునే పిల్లలు 30 మంది వరకు ఉన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు చదవాలన్నా.. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరి, పనసభద్ర గ్రామాలకు వెళ్లాల్సిందే. అంగన్‌వాడీ కేంద్రం కూడా పనసభద్రలోనే ఉంది. అంగన్‌వాడీ సేవలు పొందాలన్నా.. పౌష్టికాహారం తీసుకోవాలన్నా గర్భిణులు, బాలింతలు సైతం మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న కేంద్రానికి నడుచుకుని వెళ్లాలని గిరిజనులు చెబుతున్నారు. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న డోకిశీల పీహెచ్‌సీకి వెళ్లాల్సిందే.
●తాన్నవలసలో 20 వరకు గిరిజన కుటుంబాలు ఉన్నాయి. కొండ ఊట నీరు ఆధారంగానే పంటలు పండిస్తుంటారు. చెక్‌డ్యామ్ లేకపోవడం వల్ల కొండ నీరు వృథాగా పోతోంది. గ్రామానికి దిగువన ఉన్న స్థలంలో కొండ భూమిపై వీరికి హక్కులు కల్పిస్తూ అసైన్‌మెంట్ కాపీలిచ్చారు. సబ్ డివిజన్ చేసి, వన్‌బీలు ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. అప్పుడే ఐటీడీఏ ఫలాలు అందుతాయని ఆశిస్తున్నారు.
●తొక్కుడవలస గిరిజన గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కలుషిత నీటిని తాగడం వల్ల విష జ్వరాలు, పచ్చకామెర్లతో తరచూ గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నా.. తమ బాగోగులు ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.