
స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రాను విజయవంతం చేయాలి
పార్వతీపురంటౌన్: ప్రతి శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై కలెక్టర్ శుక్రవారం జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరగాలని స్పష్టం చేశారు. ‘ఇ వేస్ట్ మేనేజ్‌మెంట్’ శీర్షికన ఈ నెల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొని పరిశుభ్ర వాతావరణం నెలకొనే విధంగా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మండల ప్రత్యేకాధికారులు, మండల అధికారులు మండల స్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రజలను పెద్ద ఎత్తున కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని కోరారు. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండడం, కార్యాలయంలో ఇవేస్ట్ నివారణకు తగిన చర్యలు చేపట్టడం, పట్టణ ప్రాంతాల్లో ఇవేస్ట్ సేకరణ చేసి నిల్వ చేసేందుకు అవసరమైన ప్రదేశాలను గుర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలో పదివేల జనాభా కంటే ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ కార్యకలాపాలను చేపట్టి, చురుగ్గా పాల్గొనాలని అన్నారు.
చెత్త నుంచి సంపద తయారీ కావాలి
జిల్లాలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలన్నీ పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గల 212 చెత్త నుంచి సంపద కేంద్రాల నుంచి వర్మీకంపోస్టు ఉత్పాదకత జరగాలని స్పష్టం చేశారు. వర్మీ కంపోస్టు విక్రయించి స్వయం సాధికారత సాధించాలని సూచించారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్