
కొటియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల కవ్వింపు చర్యలు
సాలూరు: వివాదాస్పద ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రూప్ గ్రామాల్లో ఒడిశా పోలీసుల కవ్వింపు చర్యలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇటీవల గంజాయిభద్ర పంచాయతీ పరిధి దిగువశెంబి అంగన్‌వాడీ కేంద్రం వద్ద తెలుగులో ఏర్పాటుచేసిన బోర్డులను తీసుకెళ్లిపోయారు. ధూళిభద్ర వద్ద జల్‌జీవన్‌మిషన్ పనుల సామగ్రిని సీజ్ చేశారు. తాజాగా శనివారం ధూళిభద్ర వద్ద జల్ జీవన్‌మిషన్‌లో భాగంగా నీళ్ల ట్యాంకు నిర్మించి రంగులు వేస్తుండగా ఒడిశా పోలీసులు గొడవకు దిగారు. గ్రామానికి చెందిన చోడిపల్లి సుబ్బ, నర్సుతో పాటు విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన పెయింటర్ శివను కొటియా పోలీస్ స్టేషన్‌కు, అక్కడ నుంచి పొట్టంగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టుపై స్థానికుల ఆందోళనకు దిగారు. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ బీసు, దిగువశెంబి, ఎగువశెంబి, గంజాయిభద్ర గిరిజన యువత కొటియా స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో చేరుకుని అరెస్టు చేసిన వారిని తక్షణమే విడిచిపెట్టాలంటూ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ స్పందిస్తూ విషయాన్ని ఎస్పీకి తెలియజేశానని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లను కొటియా స్టేషన్‌కు పంపించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేస్తామని ఒడిశా పోలీసులు తెలిపినట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా మంత్రి సంధ్యారాణి, కూటమి నాయకులు స్పందించకపోవడంపై కొటియా గ్రామాల గిరిజనులు మండిపడుతున్నారు. కొటియా గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.