
ఇవేం ఆంక్షలురా బాబూ..!
పూసపాటిరేగ: మత్స్యకారుల జీవనభృతిపై ప్రభుత్వం ఆంక్షలు పెడుతూ మెమో జారీ చేయడంపై గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు. జీవనభృతి మంజూరైన మత్స్యకారులు సంక్షేమ పథకాలకు అనర్హులని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎంతో కాలంగా మత్స్యకారులకు వస్తున్న వేట నిషేధ భృతిపై ఇలా ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసమని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. మత్స్య సంపద వృద్ధి కోసం ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం అమలు చేయడం విధితమే. ఈ కాలంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. 2019 నుంచి ఐదేళ్ల పాటు వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతి ఏటా మత్స్యకార భరోసా అందజేశారు. కూటమి సర్కారు అధికారంలోకి వస్తే రూ. 20 వేల జీవనభృతి ఇస్తామని చెప్పిన నాయకులు మొదటి ఏడాది భృతి ఇవ్వకుండా దాటవేశారు. ఈ ఏడాది మే నెలలో భృతి ఇవ్వాల్సి ఉండగా.. ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు విధించడం దారుణం. జిల్లాలో గతేడాది మత్స్యకార భరోసాకు 3798 మందిని అర్హులుగా తేల్చారు. వీరందరూ వేట విరామ సమయంలో భృతి పొందినప్పటికీ.. అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరాతో పాటు ఇతర సంక్షేమ పథకాలు పొందారు. కాని నేటి కూటమి ప్రభుత్వం మాత్రం జీవన భృతి పొందిన మత్స్యకారులు ఆడబిడ్డ నిధి, చంద్రన్న పెళ్లికానుక, ఎన్టీఆర్ భరోసా పెన్సన్లకు అనర్హులుగా తేల్చింది. అలాగే 60 ఏళ్లు దాటిన వ్యక్తులు, 300 యూనిట్ల కంటే అధికంగా విద్యుత్ వినియోగించిన వారు, గ్రామీణ ప్రాంతంలో రూ. 1.20 లక్షలు, పట్టణ ప్రాంతంలో రూ. 1.44 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారు, 3 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్టు ఉన్న మత్స్యకారులను అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఇవేం ఆంక్షలురా బాబూ అంటే గంగపుత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యమం తప్పదు..
వేట నిషేధ భృతి చెల్లించాల్సిన కూటమి సర్కారు లేనిపోని ఆంక్షలు విధించడం దారుణం. భృతి పొందిన వారిని ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులుగా గుర్తిస్తే ఉద్యమం చేయక తప్పదు.
బర్రి చినఅప్పన్న , జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు, విజయనగరం.
మత్స్యకారుల జీవనభృతిపై ఆంక్షలు..
ఇంతవరకు అందని వేట నిషేధం భృతి
ఇదుగో..అదుగో.. అంటూ కాలయాపన
తాజాగా భృతి పొందిన వారికి సంక్షేమ పథకాలు కట్ అంటూ మెమో జారీ
ఆందోళనలో మత్స్యకారులు