
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
బొబ్బిలి రూరల్: మండలంలోని మెట్టవలస గ్రామానికి చెందిన కొండపల్లి శ్రీహరి(22) సోమవారం సాయంత్రం గున్నతోటవలస గ్రామం వద్ద బొబ్బిలి నుంచి విజయనగరం వైపు వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడు శ్రీహరి తండ్రి శ్రీను డ్రైవర్ కాగా శ్రీహరి టాటా మేజిక్ వాహనాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. శ్రీహరికి సోదరుడు తేజ విద్యాభ్యాసం చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్‌సీకి తరలించారు.
ఉరి వేసుకొని వ్యక్తి మృతి
పూసపాటిరేగ : మండల కేంద్రమైన పూసపాటిరేగ వాటర్ ట్యాంకు సమీపంలో అప్పులు బాధ తట్టుకోలేక అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఉరి వేసుకొని సోమవారం ఉదయం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... స్థానికులు బంధువులు అందించిన వివరాల మేరకు విజయవాడకు చెందిన కొమ్ముకూరి రాజేష్ (35) గత కొంత కాలంగా పూసపాటిరేగ పెట్రోల్ బంకు సమీపంలో హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఇటీవల కాలంలో హోటల్ నిర్వహణలో నష్టాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. భార్య నెలరోజులు క్రితం పుట్టింటికి వెళ్లిపోవడంతో రాజేష్ ఒక్కడే ఇంట్లో వుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందాడు. రాజేష్‌కు భార్య లక్ష్మి, ఇద్దరు ఆడపిల్లలు వున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. పూసపాటిరేగ ఎస్‌ఐ ఐ.దుర్గాప్రసాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య