
యశ్వంత్‌కి బంగారు పతకం
విజయనగరం అర్బన్: విద్యా శాఖ, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ రాష్ట్ర స్పెషల్ ఒలింపిక్ భారత్ కమిటీ సంయుక్త నిర్వహణలో సోమవారం నూజివీడు హీల్ పారడైజ్ స్కూల్ అగిరిపల్లిలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి స్పెషల్ ఒలింపిక్ భారత్–2025 క్రీడా పోటీలలో తొలి రోజున జిల్లాకు చెందిన ఇనుముల యశ్వంత్ 50 మీటర్ల క్రిపుల్డ్ వాక్ క్రీడాంశంలో బంగారు పతకాన్ని సాధించాడు. ప్రజ్ఞా వైకల్యం, ఆటిజం, డౌన్ సిండ్రోమ్, మస్తిష్క పక్షవాతం వైకల్యాలున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఈ నెల 23 వరకు జరిగే ఈ పోటీలలో జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు పాల్గొంటున్నారని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు తెలిపారు. తొలి రోజు బంగారు పతకం సాధించిన యశ్వంత్ తెర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి అని తెలిపారు. విజేతను డీఈఓ యు.మాణిక్యం నాయుడు, సెక్టోరియల్ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బోధన సిబ్బంది అభినందించారు.