
పేదల భూములు జోలికొస్తే ఊరుకోం
పార్వతీపురంటౌన్: పార్వతీపురంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం సాగిస్తున్న వామపక్షనాయకుల భూములు, స్థలాలకు రక్షణ కరువైందని సీపీఎం నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలో అనేక చెరువులు, గెడ్డలు, పోరంబోకు స్థలాలు కబ్జాకు గురయ్యాయని, వాటిని పట్టించుకోకుండా పేదలు, నిర్వాసితుల భూములను స్వాధీనం చేసుకోవడాన్ని ఖండించారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం పార్వతీపురం పాతబస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర దౌర్జన్యాలను ఖండిస్తూ... ఖబద్దార్ ఎమ్మెల్యే అంటూ నినదించారు. కలెక్టరేట్ ఆవరణలో బైఠాయించి ఎమ్మెల్యే తీరుపై నిరసన తెలిపారు. అనంతరం పేదల భూముల స్వాధీనాన్ని ఆపాలంటూ జాయింట్ కలెక్టర్ శోభికకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారీ రెడ్‌బుక్ తెరుస్తామని భయపెడుతోందని, నిర్వాసితులు, పేదలపై రెడ్‌బుక్ తెరిస్తే మాత్రం వందరెట్లు ఎర్ర జెండాలు ఎక్కుపెడతామని హెచ్చరించారు. పేదలకు న్యాయం చేస్తామని ఓట్లు అడిగి గెలిచి నేడు భూస్వాములకు, కార్పొరేట్లకు న్యాయం చేకూర్చడమే పనిగా పెట్టుకున్న ఎమ్మెల్యే విజయచంద్ర తీరు మార్చుకోవాలన్నారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆదేశాలకు తలొగ్గి అధికారులు పనిచేయడం తగదన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు కొల్లి సాంబమూర్తి, వి.ఇందిర, కె.రామస్వామి, మర్రి శ్రీను, రెడ్డి ఈశ్వరరావు, కోరాట ఈశ్వరరావు, సీతారాం, బి.సూరిబాబు, ఎస్.ఉమ, పి.రాము, నిర్వాసితులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అన్యాయం
పేదల భూములపై దౌర్జన్యాలకు పాల్పడడం అన్యాయం. వరహాలగెడ్డ, దేవునిబందను ఆక్రమించి పెద్దపెద్ద భవనాలు నిర్మిస్తున్నా తహసీల్దార్, కలెక్టర్ ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే ఆదేశం లేకుండా బుల్డోజర్‌తో దాడి చేయకూడదని పాఠాల్లో చదువుకున్నారా?. ప్రజలకు సేవచేయని ఎమ్మెల్యేను అందరూ వ్యతిరేకించాలి. – ఎం. కృష్ణమూర్తి,
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
కబ్జాలు మానుకోవాలి
అధికార హోదాలో ఉన్న ఎమ్మెల్యే, అధికారులు పేదల భూములు స్వాధీ నం చేసుకునేందుకు చేస్తు న్న ప్రయత్నాలు మానుకోవాలి. ఇప్పటికే రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి అనేక దుర్మార్గమైన పనులకు అధికారులు పూనుకోవడం విచారకరం. ఇదే తీరు కొనసాగిస్తే భవిష్యత్‌లో ప్రజాగ్రహానికి గురికాకతప్పదు.
– కె.గంగునాయుడు,
వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి
ఉద్యమిస్తాం
తోటపల్లి నిర్వాసితుల పోరాటం సమయంలో నాటి ప్రభుత్వం నిర్వాసితులకు ఆదుకునేందుకు భూములు ప్రకటించింది. వాటి ఆధారంగా అధికార రాజముద్రతో పొందిన భూ పట్టాలు ఉన్నప్పటికీ నేటి కార్పొరేట్ ఎమ్మెల్యేలు వాటిని తారుమారు చేస్తున్నారు. స్వలాభం కోసం ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. వీటిని సహించేది లేదు. రాజకీయ నాయకులు, అధికారులు ఎంతటి దౌర్జన్యాలకు ఒడిగట్టినా భూములు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మే 10వ తేదీలోగా జిల్లాలో ఉన్న భూ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. లేనట్‌లైతే ప్రజా సంఘాల నుంచి భారీ ఉద్యమం తప్పదు. – బంటు దాసు, నిర్వాసితుల సంఘం జిల్లా కార్యదర్శి
అన్యాక్రాంత పనులు మానుకోవాలని ఎమ్మెల్యేకు హితవు
బంటువానివలస స్థల వివాదం
పరిష్కరించాలని డిమాండ్
పట్టణంలో ర్యాలీ, కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన ప్రజాసంఘాల నాయకులు

పేదల భూములు జోలికొస్తే ఊరుకోం

పేదల భూములు జోలికొస్తే ఊరుకోం

పేదల భూములు జోలికొస్తే ఊరుకోం

పేదల భూములు జోలికొస్తే ఊరుకోం