
ఫలితం పదిలం
హ్యాట్రిక్ విజయం..
2024–25 విద్యాసంవత్సరంలో జిల్లాలో మొత్తం 10,286 మంది పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా.. ఇందులో 9,659 మంది ఉత్తీర్ణత సాధించారు. 627 మంది తప్పారు. మొత్తంగా బాలురు 4,617 (92.1శాతం), బాలికలు 5,042(95.55 శాతం) ఉత్తీర్ణత సాధించారు. సాలూరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని పెద్దపూడి తేజస్వి 592/600 మార్కులతో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. పార్వతీపురంలోని టీఆర్‌ఎం ఎంపీల్(జి) హెచ్‌ఎస్ విద్యార్థి తుంబలి చికీర్ష 591, కురుపాం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి మర్రాపు రిషిత 591, భామిని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి గౌడు జగదీష్ 590 మార్కులు సాధించారు. మరో నలుగురు విద్యార్థులు 588 మార్కులు, మరో నలుగురు 587 మార్కులు సాధించారు. వీరంతా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కావడం గమనార్హం. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల్లోనూ పార్వతీపురం జిల్లాలకు చెందిన శంబంగి అనూష (596), ఎల్.జాహ్నవి (596), వి.సాయిభువనకృతి (594), పి.దేదీప్య(593), ఎం.నితన్య(593), తెంటు జాహ్నవి(592) మార్కులు సాధించారు.
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురంటౌన్: వెనుకబడిన జిల్లా.. ఎటుచూసినా కొండ కోనలే. మారుమూల పల్లెలు.. మట్టి మనుషులు. అరకొర వసతులు.. కష్టాల ‘నావ’లను దాటుకుంటూ, రాళ్లనే ‘దారులు’గా మలుచుకుంటూ సాగే ప్రయాణాలు.. అసౌకర్యాల నడుమే బడులు.. చెట్ల కింద చదువులు.. ఇటువంటి ప్రాంతం నుంచి విద్యారంగంలో అద్భుతాలు ఆశించగలమా..! అలాంటిది అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు మన పిల్లలు. తమ విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పదో తరగతి ఫలితాల్లో మరోసారి ‘టాప్’ లేపుతూ హ్యాట్రిక్ కొట్టారు. మన్యం బిడ్డల విజయం ఎలా ఉందంటే.. వర్షం కురిసేటప్పుడు మట్టి నుంచి వెదజల్లే పరిమళమంత హాయిగా అనిపిస్తోంది!
మన మన్యం పిల్లలు అద్భుతమే సృష్టించారు. వరుసగా మూడో ఏడాది పదో తరగతి ఫలితాల్లో అగ్రస్థానాన్ని కొట్టేశారు. సగర్వంగా నిలిచారు. ఇది అంత సులువుగా రాలేదు. విద్యార్థుల పట్టుదల, రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సంకల్పం.. ప్రభుత్వ విద్యారంగంలో నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు.. దీనికి తోడు, జిల్లా అధికార యంత్రాంగం కృషి.. వెరసి ఈ ఘనత. ఆ ఫలాలే.. నేటి వరుస ఫలితాలు. రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసింది. 93.90 శాతంతో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. గత విద్యాసంవత్సరం(2024)లో 96.37 శాతం.. అంతకుముందు ఏడాది (2023)లో 87.47 శాతంతో పది ఫలితాల్లో రాష్ట్రంలోనే మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిన విషయం విదితమే. గత రెండేళ్ల ఫలితాలను ఈసారి కూడా నిలబెట్టుకోవడం విశేషం.
కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాలు సాధించాం..
కేజీబీవీల్లో మంచి ఫలితాలు వచ్చాయి. అందరి సహకారంతోనే విజయం సాధ్యమైంది. కేజీబీవీల్లో పంచతంత్ర, మై స్కూల్, మై ప్రైడ్ ప్లస్ వంటి కార్యక్రమాల ద్వారా మంచి ఫలితాలు సాధించాం. మొత్తం 540 మందికి 498 మంది ఉత్తీర్ణులయ్యారు. 42 మంది ఫెయిలయ్యారు. వీరికి రెసిడెన్సియల్ విధానంలో శిక్షణఇచ్చి, సప్లిమెంటరీలో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటాం.
– ఆర్.తేజేశ్వరరావు,
అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, ఎస్‌ఎస్‌ఏ
నిరంతర పర్యవేక్షణ, కృషితోనే..
విజయానికి ప్రధాన కారణం కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్. విద్యాశాఖ తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మై స్కూల్, మై ప్రైడ్ ప్లస్ నూతన కార్యక్రమం ద్వారా 182 పాఠశాలలను జిల్లా, మండల అధికారులకు దత్తత ఇచ్చి, నిరంతర పర్యవేక్షించేలా చేశారు. మాక్ పరీక్షలు నిర్వహించి, ఎప్పటికప్పుడు విద్యార్థులను సన్నద్ధం చేసి పరీక్షలంటే భయం పోగొట్టేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు. – ఎం.రమాజ్యోతి, ఇన్‌చార్జి డీఈవో
గత ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమీ ఫలితాలు
రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చారు. పాఠశాల స్థాయిలోనే గట్టి పునాదులు పడేలా విద్యావ్యవస్థను బలోపేతం చేశారు. నాడు–నేడు ద్వారా బడులను సమూలంగా మార్పు చేసి విద్యార్థులు స్వేచ్ఛగా, ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునేలా అవకాశం కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ విద్యను అమల్లోకి తెచ్చారు. 3,4,5 తరగతుల విద్యార్థులకు స్మార్ట్ టీవీల ద్వారా విద్యా బోధన చేపట్టారు. 8వ తరగతి దాటిన విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు ఇచ్చారు. వీటన్నింటినీ ఉపయోగించి, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యార్థులు చదువులో పోటీ పడ్డారు. ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధమయ్యారు. అప్పటి ప్రభుత్వ సంకల్పం, ఇటు జిల్లా యంత్రాగం కృషి.. నేడు మూడేళ్లుగా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి దోహదపడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. మన్యంలో విద్యాచైతన్యం వెల్లివిరుస్తోందంటూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

ఫలితం పదిలం

ఫలితం పదిలం

ఫలితం పదిలం

ఫలితం పదిలం

ఫలితం పదిలం