
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సహకరించండి
పార్వతీపురంటౌన్: జిల్లాలో అవసరమైన చోట్ల నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులను కోరారు. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేయాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో భాగంగా బీఎల్‌ఓలకు సంపూర్ణ సహకారం అందించాలని, బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం సూచించిన ప్రొఫార్మాలో ఏజెంట్ల నియామకానికి సంబంధించి వివరాలు పంపాలని ఆమె కోరారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, ఓటర్ల జాబితా స్వచ్చీకరణపై జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన చాంబర్‌లో బుధవారం డీఆర్‌ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 800–1200 మంది ఓటర్ల ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి విభజించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో ఓటర్లకు 2 కి.మీ లోపల పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో ఓటర్లకు అనువుగా ఉండే ప్రాంతాలను గుర్తించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆమె కోరారు. అదేవిధంగా ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో భాగంగా మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి వివరాలను అందజేస్తూ బీఎల్‌ఓలకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. సమావేశంలో వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బీఎల్‌ఎలను నియమించుకోవాలి
రాజకీయ పక్షాల ప్రతినిధులను కోరిన డీఆర్‌ఓ