
అప్రోచ్ రోడ్డు రైతుల సమస్యలు పరిష్కరిస్తాం
పూసపాటిరేగ: విమానాశ్రయానికి వెళ్లే రహదారిలోని రైతుల సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు విమానాశ్రయానికి సంబంధించిన వివిధ సమస్యలపై అప్రోచ్ రోడ్‌లో గుడెపువలస, రావివలస అమటాం, సవరవిల్లి, దల్లిపేట,బైరెడ్డి పాలెం గ్రామాలకు చెందిన రహదారిలో బుధవారం ఆయన పర్యటించారు. ప్రధాన సమస్య అయిన విమానాశ్రయానికి వెళ్లే అప్రోచ్ రోడ్డులో పొలాల్లోకి రహదారి సౌకర్యం కల్పించాలని రైతులు, నాయకులు కోరారు. అప్రోచ్ రోడ్డుకు ఇరువైపులా భూమి ఎంత ఉందో కొలతలు వేయాలని అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే అప్రోచ్ రోడ్డు రహదారికి భూములు ఇచ్చినప్పటికీ కోర్టు వివాదంలో పరిహారం అందలేదని నాయకులు మట్ట అయ్యప్ప రెడ్డి, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, యర్ర అప్పల నారాయణ తదితరులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కూడా అధికారులతో మాట్లాడి పరిహారం వచ్చేలా చూస్తానని కలెక్టర్ చెప్పారు. గతంలో విమానాశ్రయ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ 22ఏ లో ఉండడంతో బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్‌డీఓను కలెక్టర్ ఆదేశించారు.
ప్రతిపాదనలు పంపండి
అలాగే అప్రోచ్ రోడ్డు నుంచి అమకాం గ్రామానికి వెళ్లేందుకు రహదారి కావాలని ఆ గ్రామ నాయకులు కోరడంతో సమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వెంపాడపేట శ్మశాన వాటిక సమస్య ఆయన దృష్టికి రావడంతో స్థలాన్ని ఖరారు చేసి పంపితే అనుమతులు ఇస్తానని చెప్పారు. అమటాం రావివలస వద్ద అండర్
పాత్ కావాలని గ్రామస్తులు కోరగా అందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సూచించారు. విమానాశ్రయ నిర్మాణానికి భూములు ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, ఎయిర్‌పోర్ట్ ప్రతినిధులు రామరాజు, సర్పంచ్ ఉప్పాడ విజయభాస్కర్ రెడ్డి, నాయకులు సూర్యనారాయణ మూర్తి రాజు, కోరాడ తాతారావు, కొత్తయ్య రెడ్డి, కొల్లి రామ్మూర్తి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్