
ఎస్టీ నకిలీ సర్టిఫికెట్ల వ్వవస్థను అరికట్టాలి
● కమిషన్ చైర్మన్‌కు ఆదివాసీ జేఏసీ వినతి
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్రలో ఉన్న నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల వ్యవస్థను అరికట్టాలని ఆదివాసీ జాయింట్ ఏక్షన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సభ్యులు గురువారం ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావును ఆయన కాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. షెడ్యూల్ ప్రాంత భూములపై హక్కులు గిరిజనులకే దక్కేలా చూడాలని, ఇతర దీర్ఘకాల సమస్యలపై ప్రభుత్వ స్పందించాలని కోరారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్టీల అభ్యున్నతికి సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కమిషన్ చైర్మన్‌ను కలిసిన వారిలో జేఏసీ నాయకులు నిమ్మక జయరాజు, ఆరిక నీలకంఠం, అమర్నాథ్ తదితరులు ఉన్నారు.
మద్యం విక్రయదారు అరెస్ట్
మెరకముడిదాం: మండలంలోని ఎం.రావివలస గ్రామంలో అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్న వుణ్నా కిరణ్‌కుమార్ అనే వ్యక్తిని బుదరాయవలస ఎస్సై జె.లోకేష్‌కుమార్ అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం పక్కా సమాచారంతో ఎస్సై జె.లోకేష్‌కుమార్ సిబ్బందితో కలిసి వెళ్లి ఎం.రావివలస గ్రామంలో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్న వుణ్నా కిరణ్‌కుమార్ ఇంటిపై దాడులు నిర్వహించగా ఇంట్లో 10 మద్యం బాటిల్స్ దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు. కిరణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఇంటర్ ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురం: ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏపీ గిరిజన గురుకుల రెసిడెన్షియల్ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఆంగ్లమాధ్యమంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఓ మురళీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీటీడబ్ల్యూఆర్‌జేసీ పి.కోనవలస, కురుపాం, భద్రగిరి, ఏపీటీడబ్ల్యూఆర్‌జేసీ (బాలికలు), భద్రగిరిలో ఎంపీసీ–40, బైపీసీ–40, హెచ్‌ఈసీ–40 సీట్లు చొప్పున ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మే 7వ తేదీలోగా హెచ్‌టీటీపీఎస్:టీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ సెట్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సమీపంలో గల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలన్నారు.
పత్తి మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం టౌన్: పట్టణంలోన వైకేఎం కాలనీకి చెందిన ఓ వ్యక్తి పత్తి మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పార్వతీపురం జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వైకేఎం కాలనీకి చెందిన వెలగాల శ్రీనివాసరెడ్డి అప్పులు చేసి ఎప్పటికప్పుడు తాగుతుండడంతో భార్య సావిత్రి మందలిస్తూ ఉండేది. బుధవారం రాత్రి కూడా తాగి ఇంటికి రావడంతో భార్య మందలించింది. దీంతో మనస్తాపం చెంది గురువారం తెల్లవారు జామున పత్తి మందు తాగేశాడు. కొత్తసమయం తరువాత వాంతులు చేసుకోవడంతో పత్తిమందు వాసన రాగా భార్య సావిత్రి గమనించి 108 ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తీసుకొ రావడంతో వైద్యులు చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం స్థానిక కర్షక మహర్షి ఆస్పత్రికి తరలించారు.
నేడు ఏపీఆర్‌జేసీ గురుకుల ప్రవేశ పరీక్ష
విజయనగరం అర్బన్: ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌ఈఐ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు డీఆర్‌ఓ శ్రీనివాస్ మూర్తి తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్టుమెంటల్ అధికారులతో గురువారం ఆయన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీఆర్‌ఈఐ గురుకులాల్లో 5, 6, 7, 8 తరగతులలో ప్రవేశం కోసం ఈ నెల 25న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జిల్లాలోని 6 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష కోసం 1,287 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీల్లో ప్రవేశం కోసం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీఆర్‌జేసీ కోసం 10 కేంద్రాల్లో 2104 మంది అభ్యర్ధులు, ఏపీఆర్‌డీసీ కోసం 77 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారన్నారు. సమావేశంలో డీఈఓ యూ.మాణిక్యం నాయుడు, పరీక్షల సహాయ కమిషనర్ టి.సన్యాసిరాజు, ఏపీఆర్‌ఐఈ జిల్లా కోఆర్డినేటర్ శంబాన రూపవతి పాల్గొన్నారు.

ఎస్టీ నకిలీ సర్టిఫికెట్ల వ్వవస్థను అరికట్టాలి