
జిల్లా క్రీడాకారిణులకు చోటేది?
విజయనగరం: పోటీలు జిల్లా స్థాయివి.. పాల్గొనేది మాత్రం పొరుగు జిల్లా క్రీడాకారిణులు. జిల్లా క్రీడాధికారుల తీరుపై జిల్లా క్రీడా సంఘాలు భగ్గుమంటున్నాయి. అధికారుల తీరును దుమ్మెత్తిపోస్తున్నాయి. క్రీడా రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా పథకంలో భాగంగా రాష్ట్రంలోని 7 జిల్లాల్లో అస్మిత సిటీ లీగ్ పోటీలు నిర్వహణకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు విజయనగరంలో బాక్సింగ్ పోటీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పోటీల నిర్వహణకోసం కొంత నగదును కేటాయించారు. ఇందులో భాగంగా స్థానిక విజ్జీ స్టేడియంలో గురువారం బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. వీటిలో జిల్లా స్థాయి క్రీడాకారిణులు మాత్రమే పాల్గొనాలి. అధికారిక సమచారం ప్రకారం ఈ పోటీల్లో 100 మంది క్రీడాకారిణులు పాల్గొనగా... అందులో విజయనగరం జిల్లాకు చెందిన క్రీడాకారిణులు కేవలం 15 మంది మాత్రమే. మిగిలిన 80 మందికి పైగా క్రీడాకారిణిలు విశాఖ జిల్లాలోని ఓ శిక్షణ కేంద్రానికి చెందినవారు కావడం గమనార్హం. స్థానిక అధికారులు శాప్ ఆదేశాలను తుంగలోతొక్కి తూతూ మంత్రంగా పోటీలు నిర్వహించి చేతులుదులుపుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోటీలు నిర్వహించిన జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారుల తీరుపై క్రీడా సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
శాప్ ఆదేశాలను పట్టించుకోని
అధికారులు
పొరుగు జిల్లా క్రీడాకారిణులతో
జిల్లాస్థాయి పోటీలు
అస్మిత సిటీలీగ్ బాక్సింగ్ పోటీల
నిర్వహణపై విమర్శల వెల్లువ
భగ్గుమంటున్న క్రీడా సంఘాలు