
కోర్టు వాయిదాకు వెళ్లి వస్తూ నిందితుడి మృతి
● బస్సులో వస్తుండగా మార్గమధ్యంలో అస్వస్థత
కొత్తవలస: జిల్లా కేంద్రంలో గల కోర్టు వాయిదాకు వెళ్లి వస్తుండగా లక్కవరపుకోట మండలం రేగ గ్రామానికి చెందిన గొల్ల అప్పారావు(40) మార్గమధ్యంలో అస్వస్థతకు గురై మృతిచెందాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అప్పారావు 2021వ సంవత్సరంలో జరిగిన ఒక హత్య కేసులో నిందితుడు. ఈ మేరకు శుక్రవారం విజయనగరం జిల్లా కోర్టుకు కేసు వాయిదాకు తల్లిదండ్రులు, భార్యతో కలిసి వెళ్లాడు. వాయిదా ముగిసిన తరువాత భార్య మందుల కొనుగోలు కోసం విజయనగరంలో ఉండిపోగా తల్లిదండ్రులతో కలిసి విజయనగరం–అనకాపల్లి బస్సులో కొత్తవలస వచ్చేందుకు బస్సు ఎక్కాడు. భీమసింగి జంక్షన్‌కు వచ్చేసరికి అప్పారావు తీవ్ర అస్వస్థతకు గురికాగా కొత్తవలస తహసీల్దార్ గేటువద్దకు వచ్చేసరికి ఆర్‌టీసీ బస్సు నుంచి అప్పారావును, తల్లిదండ్రులను సిబ్బంది దించేసిన అనంతరం బస్సు వెళ్లిపోయింది.
స్పందించని 108 సిబ్బంది
తీవ్ర ఆస్వస్థతకు గురైన అప్పారావును స్థానికులు గుర్తించి వెంటనే 108 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయగా కొత్తవలస, ఎల్.కోట, జామి మండలాల వాహనాలు అందుబాటులో లేవని వేరే మండలం నుంచి వాహనం రప్పించేందుకు గంటకు పైగా పడుతుందని అంతవరకు ఉంటే ఉండండి లేదంటే మీఇష్టమని సిబ్బంది బదులిచ్చారు. దీంతో కాసేపు వేచి ఉండి చెంతనే గల పీహెచ్‌సీ వైద్యులకు సమాచారం అందించగా డాక్టర్ వచ్చి పరిశీలించి పల్స్ పడిపోయిందని మృతిచెందినట్లు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న వృద్ధ తల్లిదండ్రులు భోరుమంటూ విలపించారు. స్థానికులు చందాలు వేసుకుని మృతదేహాన్ని స్వగ్రామం రేగకు ఆటోలో తరలించారు. కాగా మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.