గోదావరిఖని: ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరపుతూ, సొమ్మంతా ఆమెకే వెచ్చిస్తున్నాడనే కోపంతో ఐదుగురితో కలిసి ఓ భార్య తన భర్తను హతమార్చిందని డీసీపీ వైభవ్‌గైక్వాడ్ వెల్లడించారు. గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన కొచ్చర ప్రవీణ్(42)ను అతడి భార్య కొచ్చెర లలిత(34), రామగుండం హౌసింగ్‌బోర్డ్‌కాలనీకి చెందిన మచ్చ సురేశ్(37), ఇందారపు సతీశ్(25), మందమర్రికి చెందిన నన్నపరాజు చంద్రశేఖర్(38), లారీ క్లీనర్ భీమ గణేశ్(23), లారీ డ్రైవర్ మాసు శ్రీనివాస్(33) ఈ హత్య కేసులో ప్రధాన నిందితులని వివరించారు.
గోదావరిఖనిలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, బిల్డర్‌గా అతితక్కువ సమయంలో ఎదిగిన ప్రవీణ్‌ను పథకం ప్రకారం చంపారని తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. విలేకరిగా తన ప్రస్థానం ప్రారంభించిన ప్రవీణ్.. మందమర్రి ప్రాంతానికి చెందిన లలితను 15ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వ్యాపార రీత్యా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఇతడికి గోదావరిఖని ప్రాంతానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈక్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
వీటిని మర్చిపోయేందుకు ప్రవీణ్ మద్యం తాగి ఇంటికి వెళ్లేవాడు. ఈపరిణామాలతో విసిగిపోయిన భార్య లలిత.. తన భర్తను వదిలించుకోవాలని పథకం రచించింది. ఈక్రమంలో సెంట్రింగ్ పనుల కోసం ఇంటివద్దకు వచ్చే సురేశ్‌కు తన సమస్య విన్నవించి, తన భర్తను చంపేందుకు సాయం చేయాలని కోరింది. హత్య కేసులో ఇరుక్కుంటే తన కుటుంబం ఇబ్బంది పాలవుతుందని సురేశ్ చెప్పడంతో ఒకఫ్లాట్ రాసి ఇస్తానని లలిత ఒప్పందం చేసుకుంది. తొలుత ఎవరికీ అనుమానం రాకుండా మద్యం మత్తులో నిద్రిస్తున్న ప్రవీణ్ ముఖంపై దిండు పెట్టి చంపాలని నిర్ణయించుకున్నారు. అయినా చనిపోకపోతే పాముతో కాటేసి చంపించి సహజ మరణంగా చిత్రీకరించాలని చూశారు.
సొమ్ము చెల్లింపు కోసం అంగీకారం..
లలిత, మచ్చ సురేశ్ ఇద్దరూ కలిసి ప్రవీణ్‌ను అంతమెందించేందుకు నిర్ణయించుకున్నారు. సాయం కోసం ఇందారం సతీశ్‌ను సంప్రదించారు. మరోమిత్రుడు మందమర్రికి చెందిన మాస శ్రీనివాస్‌ను సంప్రదించి పాములు పట్టే వ్యక్తి కావాలని కోరారు. అందుకు శ్రీనివాస్ అంగీకరించి తనకు పరిచయం ఉన్న భీమ గణేశ్ ద్వారా మందమర్రి ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు నన్నపురాజు చంద్రశేఖర్‌ను సంప్రదించారు. ముందుగా తన పథకాన్ని అమలు చేసేందుకు కొంతడబ్బు కావాలని కోరగా తనవద్ద ఉన్న 34గ్రాముల బంగారు గొలుసు సురేశ్‌కు ఇచ్చి దాన్ని అమ్మిఖర్చులకు ఉపయోగించుకోవాలని లలిత సూచించింది.
పాముతో కాటు వేయించి..
ఈనెల 9న పాము అందుబాటులో ఉందని చంద్రశేఖర్ ఫోన్‌ద్వారా మచ్చ సురేశ్‌కు సమాచారం ఇచ్చాడు. ఆరోజే కొచ్చెర ప్రవీణ్‌ను అంతమొందించేందుకు నిర్ణయించారు. ఈక్రమంలో అందరూ రామగుండంలో కలిసి మద్యం తాగుతూ లలితతో ప్రవీణ్ కదలికల గురించి తెలుసుకుంటూ ఉన్నారు. అతను నిద్రకు ఉపక్రమించిన తర్వాత లలిత ఈ విషయాన్ని నిందితులకు తెలియజేసింది. దీంతో మచ్చ సురేశ్, అతడి అనుచరులు రెండు బైక్‌లపై ప్రవీణ్ ఇంటికి చేరుకున్నారు. వారిరాకకోసం ఎదురుచూస్తున్న లలిత.. ఇంటిముందున్న ప్రధాన ద్వారాలు తెలిచి ఉంచి ఇంట్లోకి ఆహ్వానించింది. పడకగదిలో నిద్రిస్తున్న ప్రవీణ్‌ను చూపించింది. తాను మరో గదిలో కూర్చుంది.
ఈక్రమంలో సురేశ్ చద్దరుతో ప్రవీణ్‌ముఖం, ముక్కుపై అదిమిపట్టి శ్వాసఆడకుండా చేయగా అతడి అనుచరులు ఇందారపు సతీశ్, భీమ గణేశ్, మాస శ్రీనివాసు.. ప్రవీణ్ కాళ్లు, చేతులు గట్టిగా అదిమిపట్టుకుని మచ్చ సురేశ్‌కు సహకరించారు. ఒకవేళ ఇలా చనిపోకపోతే పాము కాటుతో చంపేయాలని తన మిత్రుడు చంద్రశేఖర్ సాయంతో పాము కాటు వేయించాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మచ్చ సురేశ్, అతడి మిత్రులు అక్కడి నుంచి పరారయ్యారు. పామును గోదావరి బ్రిడ్జి దాటిన తర్వాత అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆ తర్వాత లలిత తన భర్త సాధారణంగానే మరణించినట్లు చిత్రీకరించేందుకు యత్నించింది. గుండెనొప్పితో చనిపోయినాడని ఇరుగుపొరుగువారికి చెప్పింది. శవాన్ని ప్రీజర్‌లో పెట్టి అంతిమసంస్కారాలకోసం ఉంచింది.
తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి..
ప్రవీణ్ తల్లి ఫిర్యాదు చేయడంతో వన్‌టౌన్ సీఐ ప్రమోద్‌రావు రంగప్రవేశం చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. అనుమానం రావడంతో భార్యను విచారించడంతో వాస్తవాలు వెలుగులోకివచ్చాయి. తానే హత్య చేయించినట్లు ఆమె ఒప్పుకుంది. ఈమేరకు నిందితులను అరెస్ట్ చేసి, వారినుంచి మూడు ద్విచక్రవాహనాలు, ఆరు మొబైల్‌ఫోన్లు, 34గ్రాముల బంగారు చైన్‌స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వివరించారు. సమావేశంలో సీఐ ప్రమోద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment