ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
పెద్దపల్లిరూరల్: గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ తన కార్యాలయంలో శనివారం సమీక్షించారు. ఈనెల 27న పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలని అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, సీసీ కెమెరాల ఏర్పాటు, వెబ్ కాస్టింగ్ పకడ్బందీగా ఉండాలన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా నిఘా ఉంచాలని తెలిపారు. డబ్బు, మద్యం, ఆభరణాలు, పరికరాలతో ప్రభావితం చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయి సమాచారంతో అప్రమత్తంగా ఉంటూ, దాడులు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు చేశామని, అక్కడ సిబ్బందికి ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఓటర్లకు స్లిప్పుల పంపిణీ పూర్తిచేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని పోలీస్ అధికారులకు సూచించారు.
మిషన్ భగీరథ నీటిని వినియోగించాలి
జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న తాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ వాటర్ ట్యాప్‌లను కలెక్టర్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యూవీ ప్యూరిఫైర్ ప్లాంట్ ద్వారా మిషన్ భగీరథ బల్క్ నీటిని శుద్ధి చేసి ట్యాప్‌ల ద్వారా సరఫరా చేస్తున్నామని, ఇందుకోసం ప్రతీఫ్లోర్‌లో రెండు ట్యాప్‌లు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీ హర్ష
Comments
Please login to add a commentAdd a comment