
అధికార యంత్రాంగం అప్రమత్తం
● దోమల నియంత్రణకు ఫాగింగ్ ● ఖాళీ ప్లాట్లలో మురుగునీరు తొలగిస్తాం
● ‘సాక్షి, ఇంటర్వ్యూలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్
పెద్దపల్లిరూరల్: శీతాకాలం ముగుస్తోంది. వేసవి ఆరంభమవుతోంది.
వాతావరణం మారుతోంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసంతో పట్టణవాసులు జలుబు, జ్వరం, ఇతరత్రా సీజనల్ వ్యాధులకు గురవుతున్నారు. ప్రజలు వ్యాధులకు గురవకుండా తమ అధికార యంత్రాంగం అప్రమత్తమైందని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ వెల్లడించారు. ప్రత్యేకంగా పారిశుధ్యం మరింత మెరుగుపర్చుతున్నామన్నారు. రోడ్లకు ఇరువైపులా మురుగునీటి కాలువలు నిర్మించే పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. దోమల నియంత్రణకు ఫాగింగ్ చేయిస్తున్నామని చెప్పారు. ఖాళీగాఉన్న ప్లాట్లలో నీరు నిల్వ ఉండకుండా యజమానులకు నోటీసులు జారీచేశామన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
సాక్షి: వీధుల్లో పారిశుధ్యం లోపిస్తోంది?
కమిషనర్: కొత్త కాలనీల్లో ఈ సమస్య కొద్దిగా ఉంది. ఆయా ప్రాంతాలతో పాటు ప్రధాన రోడ్లకు ఇరువైపులా డ్రెయినేజీలు నిర్మిస్తున్నాం. పారిశుధ్య సమస్యను పరిష్కరిస్తున్నాం.
సాక్షి: దోమలను ఎలా నియంత్రిస్తారు?
కమిషనర్: దోమలు వృద్ధి చెందకుండా క్రమం తప్పకుండా అన్ని వీధుల్లో ఫాగింగ్ చేయిస్తున్నాం. డ్రెయినేజీల్లో ఆయిల్‌బాల్స్ వేయిస్తున్నాం. వార్డు ఆఫీసర్లు, సిబ్బంది కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
సాక్షి: మురుగుకాలువల్లో చెత్తాచెదారం వేయడాన్ని నియంత్రించారా?
కమిషనర్: ఇళ్ల నుంచి వెలువడే తడి, పొడి చెత్తను వేర్వేరుగా డబ్బాల్లో ఉంచి ఇంటికి వచ్చే సిబ్బందికి అందించాలని ప్రజలకు అవగాహన కల్పించాం. ప్రజలు కూడా చెత్తను వేర్వేరుగా అందించి సిబ్బందికి సహకరించాలి.
సాక్షి: పారిశుధ్యం మెరుగుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
కమిషనర్: రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పారిశుధ్యం మెరుగుపర్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. వార్డుల వారీగా వాహనాలను ఏర్పాటు చేసి మా సిబ్బందిని ఇళ్లకు పంపిస్తున్నాం. ఇంటింటా చెత్త సేకరిస్తున్నాం. మురుగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
సాక్షి: ఖాళీ ప్లాట్లలో మురుగునీరు చేరి దోమలు వృద్ధి చెందుతున్నాయి?
కమిషనర్: ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు పెరగడం, సమీప ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు అందులో చేరకుండా చూడాలని గతంలో ప్లాట్ల య జమానులకు నోటీసులిచ్చాం. మళ్లీ వాటిపై దృష్టి సారిస్తాం. అవసరమైన చర్యలు తీసుకుంటాం.

అధికార యంత్రాంగం అప్రమత్తం
Comments
Please login to add a commentAdd a comment