గోదావరిఖని(రామగుండం): సింగరేణి ఓసీపీ–3లో కాంట్రాక్టు మస్టర్ల కుంభకోణంపై విజిలెన్స్ అధికారులు కూపీ లాగుతున్నారు. ప్రాజెక్టులోని బేస్‌వర్క్‌షాప్‌లో క్లీనింగ్ కోసం కాంట్రాక్టు పద్ధతిన కార్మికులను వినియోగిస్తారు. వీరి ప్రతిరోజు మస్టర్ల విషయంలో గోల్‌మాల్ జరిగినట్లుగా తెలుస్తోంది. కాంట్రాక్టు కార్మికుల మస్టర్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని విజిలెన్స్‌కు ఫిర్యాదు వెళ్లడంతో నిఘా పెట్టింది. ఈక్రమంలో ఇప్పటికే విజిలెన్స్ అధికారులు వచ్చి విచారణ జరిపి వెళ్లినట్లు తెలుస్తోంది. ఓసీపీ–3 బేస్‌వర్క్‌షాప్‌లో అసలు కాంట్రాక్టు కార్మికులు ఎంత మంది పనిచేస్తున్నారు. ప్రతిరోజు ఎంత మందిని వినియోగిస్తున్నారు. పనిచేయని మిగతా కార్మికులు ఎంత మంది అనే అంశాలపై కూపీలాగినట్లు తెలుస్తోంది. ఈమేరకు కార్పొరేట్ విజిలెన్స్ జీఎంకు నివేదిక అందజేసినట్లు సమాచారం. అయితే దీనిపై వాస్తవాలను తెలియజేయాలని కోరుతూ ఆర్జీ–2 యాజమాన్యానికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి 19మంది కాంట్రాక్టు కార్మికులు, ఒకరు సూపర్‌వైజర్ బేస్‌వర్క్‌షాప్‌లో పనిచేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే వీరిలో 15మంది హాజరైతే 20మంది వచ్చినట్లుగా చెప్పి కాంట్రాక్టర్ తప్పుడు లెక్కలు చూపినట్లు తెలిసింది. అయితే దీనిలో కొంత మంది సంస్థ ఉద్యోగులు కూడా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
రూ.50 లక్షల మేర కుంభకోణం?
కాంట్రాక్టు వర్కర్ల కుంభకోణం గడిచిన ఐదు నుంచి పదేళ్లుగా కొనసాగుతున్నట్లుగా అనుకుంటున్నారు. ఇదే జరిగితే ప్రతి రోజు ఐదు మస్టర్లు అదనంగా వేసుకుంటే ఈలెక్కన సుమారు రూ.50లక్షల మేర సంస్థకు నష్టం జరగనుంది. ఈవిషయంలో ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై విజిలెన్స్ విభాగానికి చెందిన అధికారులు ఓసీపీ–3లో పర్యటించి పూర్తిస్థాయిలో వివరాలు తీసుకెళ్లినట్లుగా కార్మికులు చెబుతున్నారు. అయితే ఏరియా స్థాయిలో కూడా నివేదిక తెప్పించుకునేందుకు విజిలెన్స్ జీఎం, ఆర్జీ–2 యాజమాన్యానికి లేఖ రాసినట్లు తెలిసింది. ఈక్రమంలో విచారణ కూడా ప్రారంభం అయినట్లుగా సమాచారం. కాగా, ఈ వ్యవహారంపై అంతర్గతంగా విచారణ జరుగుతుండగా, అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
కూపీలాగుతున్న అధికారులు
రూ.50లక్షల వరకు చేతులు మారాయనే ఆరోపణ
పూర్తిస్థాయి విచారణకు విజిలెన్స్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment