
ప్రమాదాల వారధి
● పట్టించుకునే వారేరి? ● ఇప్పటికే నలుగురి మృతి
జ్యోతినగర్(రామగుండం): సింగరేణి సంస్థ మేడిపల్లి ఓపెన్‌కాస్టు గతంలోనే మూతపడింది. దీంతో మేడిపల్లి – మల్కాపూర్ మధ్య గల రోడ్డు మరమ్మతులు విస్మరించారు. రహదారి శిథిలం కావడం, నిత్యం వాహనాల రాకపోకలు అధికం కావడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయినా, దీనిగురించి పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడని స్థానికులు వాపోతున్నారు.
మల్కాపూర్ – రాజీవ్
రహదారి మధ్య రోడ్డు..
రామగుండం కార్పొరేషన్ ఐదో డివిజన్ మల్కాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై నిత్యం వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. రాజీవ్ రహదారి నుంచి గ్రామం వరకు ఇటీవల రోడ్డు నిర్మించారు. కానీ, గోదావరినది వైపు వెళ్లే ఓపెన్ కాస్టు రోడ్డును అలాగే వదిలేశారు. ఓపెన్‌కాస్టులో బొగ్గు తవ్వకాలు జరిగినప్పుడు సింగరేణి కార్మికులు ఈ మార్గంలోనే విధులకు వెళ్లివచ్చేవారు. ప్రస్తుతం రోడ్డు శిథిలమై, గుంతలు పడి ప్రయాణానికి నరకం చూపుతోంది. రాత్రివేళ అటువైపు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వరద కాలువపై ఉన్న వంతెనకు ఇరువైపులా గోడలు లేవు. వాహనాలు కాలువలో పడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత రెండు సంవత్సరాల్లో కాలువలో పడి ముగ్గురు మృతి చెందారు. సోమవారం రాత్రి కూడా మ ల్కాపూర్ గ్రామానికి చెందిన మానాల వెంకటే శం వాహనంతో కాలువలో పడి చనిపోయాడు.
రోడ్డంతా గుంతలమయం
మేడిపల్లి ఓపెన్ కాస్టు – మల్లాపూర్ మధ్య రోడ్డు గుంతలమయంగా మారింది. రెండు సంవత్సరాల క్రితం గోదావరి నది బ్యాక్ వాటర్ రావడంతో కాలువపై నిర్మించిన బ్రిడ్జి కూలిపోయింది. అధికారులు తాత్కాలికంగా మట్టిపోసి రాకపోకలు సాగేలా ఏర్పాట్లు చేశారు. కానినీ, దానికి వరదకాలువ వైపు గోడలేక రాత్రి సమయాల్లో వాహనాలు అదుపుతప్పి వరదకాలువలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రమాదాల వారధి