● అన్నదాతకు వడగళ్ల కడగండ్లు ● దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలు ● ధ్వంసమైన కూరగాయల తోటలు ● రాలిపోయిన మామిడికాయలు ● లోతట్టు ప్రాంతాలు జలమయం ● జిల్లా కేంద్రంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ● పెద్దపల్లిలో అత్యధికంగా 32.8 మి.మీ. వర్షపాతం నమోదు
పెద్దపల్లిరూరల్: అన్నదాతల ఆశలను అకాల వర్షం నీటిపాలు చేసింది. చేతికందే దశలో ఉన్న వరి, మొక్కజొన్న పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. కూరగాయాల తోటలకూ తీరని నష్టమే జరిగింది. మామిడిపూత, కాత కూడా నేలరాసింది. శుక్రవా రం సాయంత్రం ఒక్కసారిగా గాలిదుమారంతో కూడిన వడగళ్లు కురవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. పెద్దపల్లి, ధర్మారం, జూలపల్లిలో వర్షం అధికంగా కురిసింది. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. వరి ఇప్పుడిప్పుడే గింజ దశకు చేరుకుంటోంది. దీనికి పెద్దగా నష్టం ఉండకపోవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మొక్కజొన్నకు కొంత నష్టం జరగొచ్చని వారు వివరించారు. అధికారులు ఇలా పేర్కొంటుంటే.. తమకు కనీసం పెట్టుబడి కూడా వచ్చేట్టులేదని రైతులు ఆవేదన చెందుతు న్నారు. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాంటున్నారు.
వివిధ గ్రామాల్లో..
పెద్దపల్లి పట్టంలో రాత్రి 8గంటల వరకు అత్యధికంగా 32.8మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురి సింది. ధర్మారం మండలంలో 29మి.మీ., జూలపల్లి మండలంలో 26మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పెద్దపల్లి మండలం నిట్టూ రు, నిమ్మనపల్లి, హన్మంతునిపేట, రాంపల్లి, భోజ న్నపేట గ్రామాల్లో రాళ్లవాన కురిసింది. రాంపల్లిలో నేలవాలిన మొక్కజొన్న పంటను మండల వ్యవసాయాధికారి అలివేణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం..
జిల్లాకేంద్రంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుభాష్ విగ్రహం వద్ద ఇప్పటికే డ్రైనేజీని మూసివేయగా.. మురుగునీరంతా రోడ్డు పైకి చేరుతోంది. వర్షానికి సైతం సుభాష్‌విగ్రహం ప్రాంతమంతా మోకాలిలోతులో నిలిచింది. మురుగునీరు రోడ్డుపైనే ప్రవహించింది. పోలీస్‌స్టేషన్ ఆవరణలోకి వర్షపునీరు వచ్చి చేరింది. బస్టాండ్, కమాన్ ప్రాంతాల్లోనూ ప్రధాన రోడ్లపై వర్షపు నీరు నిలిచి రాకపోకలకు తీవ్రఅంతరాయం కలిగింది.
విద్యుత్ తీగలపై పడ్డ ఫ్లెక్సీ
భారీగాలులతో కూడిన వర్షం ధాటికి జిల్లా కేంద్రంలోని ఓ భవనంపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చిరిగి విద్యుత్ తీగలపై పడింది. దీంతో విద్యుత్ సరఫరాకు తీవవ్ర అంతరాయం కలిగింది. ట్రాన్స్‌కో ఏ ఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది వెంటనే దానిని తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
మంథనిలో..
మంథని: అకాల వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కానీ, వివిధ పంటలకు నష్టం కలిగిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంథనిలో ఓ మోస్తరు వర్షం కురిసింది. వరి తదితర పంటలు దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు.
సుల్తానాబాద్‌లో..
సుల్తానాబాద్(పెద్దపల్లి): మండల కేంద్రంతోపాటు సుగ్లాంపల్లి, పూసాల, ఆరేపల్లి తదితర గ్రామాల్లో భారీవర్షం కురిసింది. ఆయా గ్రామాల్లో మొక్కజొ న్న కర్ర నేలవాలింది. పొట్టదశలోని వరి నీటిపాలైంది. వర్షంతో ఎలాంటి ప్రయోజనం లేదని, నష్టమే అధికంగా ఉందని రైతులు వాపోయారు.
ధూళికట్టలో..
ఎలిగేడు(పెద్దపల్లి): ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో ఈదురుగాలులతో కూడి భారీవర్షం కురిసింది. దాదాపు అర్ధగంటపాటు వర్షం బీభత్సం సృష్టించింది. వడగళ్లు భారీగా కురిశాయి. మొక్క జొన్న కర్రలు నేలవాలాయి, పొట్ట, ఈనేదశలోని మొక్కజొన్న కర్రలు, వరి పైరు తీవ్రంగా దెబ్బతి న్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మామిడికాయలు చెట్లపైనుంచి రాలి తీవ్రనష్టం కలిగించాయని అన్నారు. ఎలిగేడు, ముప్పిరితోట తదితర గ్రామాల్లో తుంపర వర్షం కురిసింది.
నేలవాలిన మొక్కజొన్న
జూలపల్లి(పెద్దపల్లి): కోనరావుపేట, జూలపల్లి, వడ్కాపూర్, పెద్దాపూర్, అబ్బాపూర్, నాగుపల్లె, తెలుకుంట తదితర గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానకు వరి, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఒక్కసారిగా వచ్చిన గాలివాన అతలాకుతలం చేసింది. ఆరుగాలం కష్టపడిన అన్నదాత శ్రమ మరో నెలరోజుల్లో చేతికి వస్తుందనగా అకాలవర్షం ఆగమాగం చేసింది.
పంటంతా పడిపోయింది
నాకున్న ముప్పయి గుంటల్లో మక్క ఏసిన. కంకులు పాలు పోసే దశ వచ్చినయి. అకాల వర్షం కర్రలను నెలపాలు చేసింది. మరో నెలరోజుల్లో చేతికొచ్చే పంట తీవ్రంగా దెబ్బతిన్నది. నలభై వేల రూపాయల వరకు నష్టం వాటిల్లింది.
– దాడి కుమార్, రైతు, కోనరావుపేట
ఆశలు.. నీళ్లపాలు
ఆశలు.. నీళ్లపాలు
ఆశలు.. నీళ్లపాలు
ఆశలు.. నీళ్లపాలు