
నవ విశ్వాసం
ఆదివారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2025
● నేడు విశ్వావసునామ ఉగాది పర్వదినం ● ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణాలకు ఆలయాలు సిద్ధం
తీపి, చేదు జ్ఞాపకాల క్రోధి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకు తూ.. వనాలన్నీ చిగురించే వేళ, పూల పరిమళాలు వెదజల్లే వేళ.. కోయిలమ్మల కుహుకుహు రాగాలు.. హాయినిచ్చే వెచ్చని గాలులు.. వెలుగులు పంచే విశ్వావసునామ తెలుగు సంవత్సరానికి ప్రజలు ఆదివారం స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. వసంత రుతువు ఆగమనంతో చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయం నుంచి తెలుగు నూతన సంవత్సర ఉగాది జరుపుకోవడం ఆనవాయితీ. ఉగాది అంటే కష్ట సుఖాల కలయిక. షడ్రుచుల వేడుక. నూతన వస్త్రధారణ, ఆలయాల సందర్శన, ఇష్టదైవాల ఆరాధనతోపాటు.. పంచాంగ శ్రవణాలు, పిండి వంటల తయారీ ప్రత్యేకం. నేడు విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పండితులు, కవులు, అలనాటి వేడుకలు, మారిన కాలంలో ఉగాది ఉషస్సుల ప్రత్యేకతలపై కథనం..
పంటలు సమృద్ధిగా..
మంథని: విశ్వావసు నామ సంవత్సరంలో పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉంది. పత్తి, వరి, తెల్లజొన్నలు వంటి పంటలు ఎక్కువగా లాభాలనిస్తాయి. పాలకుల మధ్య విభేదాలతో ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుంది. అయినా ప్రజల్లో స్నేహభావంతో మేలు పెరుగుతుంది. భయాందోళనకర వాతావరణం ఉన్నా భగవతారాధన వల్ల అందరూ సుభిక్షింగా ఉంటారు. బంగారం, లోహ సంబంధిత వస్తువుల ధరలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
– వొజ్జల గణేశ్ అవధాని, వేద పండితుడు, మంథని
45 వసంతాలుగా..
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడిని. 45 ఏళ్ల నుంచి ఉగాది నాడు పంచాంగ శ్రవణం చదివి వినిపిస్తున్న. విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు, ఉద్యోగులు, అధికారుల మధ్య విశ్వాసం పెంపొందుతుంది. లోక కల్యాణార్థం యాగాలు, హోమాలు చేయడం జరుగుతుంది. రైతులు పంటలు అధికంగా పండిస్తారు. – జగన్నాథచార్యులు, యైటింక్లయిన్‌కాలనీ

నవ విశ్వాసం