
స్పందన అంతంతే
● ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించలే ● అవగాహన లోపం.. సాంకేతిక సమస్యలే కారణం ● రాయితీ ప్రకటించి, ప్రచారం చేసినా నేరవేరని సర్కారు లక్ష్యం ● 4,765 మంది ఫీజు చెల్లింపు.. రూ.15.41కోట్ల ఆదాయం ● గడువు పొడిగింపుపైనే ఆశలు
సాక్షి, పెద్దపల్లి: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) గడువు ముగిసింది. జిల్లావాసుల నుంచి స్పందన కరువైంది. ఆదినుంచీ గందరగోళంగా సాగిన ప్రక్రియతో ప్రభుత్వం ఆశించిన మేర ఆదాయం సమకూరలేదు. రామగుండం కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలతోపాటు 266 గ్రామా ల్లో కలిపి 25,543 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 4,765 మందే ఫీజు చెల్లించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రాయితీపై అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రచారం చేసినా సాంకేతిక సమస్యలకు తోడు, దరఖాస్తుదారుల్లో అవగాహన లోపంతో ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది.
25 శాతం రాయితీ ప్రకటించినా..
లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 2020 ఆగ స్టు 26వ తేదీ వరకు రూ.వెయ్యి ఫీజు చెల్లించిన భూ యజమానుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వీటికోసం యూజర్ మాన్యువల్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎల్‌ఆర్‌ఎస్–2020 పేరిట ప్రభుత్వం వెబ్‌సైట్ రూపొందించింది. అర్జీల పరిష్కారం కోసం మూ డంచెల(లెవల్–1, లెవల్–2, లెవల్–3) విధానాన్ని అమలు చేసింది. దరఖాస్తుదారులు బల్దియాలకు బారులు తీరినా.. సర్వర్ మొరాయించడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ లెవల్–1 వద్దే దరఖాస్తులు ఆగిపోయాయి. కొందరు దరఖాస్తుదారులు ఫీజు చెల్లించేందుకు యత్నించినా వెబ్‌సైట్‌లో వివరాలు కనిపించలేదు. ఇంకొందరికి క్షేత్రస్థాయి పరిశీలన పెండింగ్‌లో ఉన్నట్లు చూపించింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు చూపిస్తే నీటిపారుదల శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. వీటన్నింటికీ ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలే కారణమని అధికారులు చెబుతున్నారు.
కొరవడిన సమన్వయం
ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియకు మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం కొరవడింది. నిషేధిత జాబితాలో ఉన్నట్లు కనిపిస్తున్న సర్వే నంబర్లకు సంబంధించి దరఖాస్తుదారులు హెల్ప్‌డెస్క్‌లో సంప్రదిస్తే.. సదరు సర్వే నంబర్ నిషేధిత జాబితాలో లేదని రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి లేఖ తీసుకురావాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంప్రదిస్తే.. మున్సిపాలిటీ నుంచి సర్వే నంబర్ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో లేనట్లుగా ధ్రువీకరణపత్రం తీసుకురావాలని చెప్పారు. ఇలా అర్జీదారులు ఇబ్బందులుపడ్డారు. ఈరెండు శాఖల మధ్య సమన్వయ లోపంతోపాటు ఇరిగేషన్ శాఖలో అసలు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ వివరాలు లేకపోవడం శాపంగా మారింది.
ఫీజు చెల్లించినవారు 4,765 మందే
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి 25,543 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు అందాయి. ఇందులో 4,765 మంది దరఖాస్తుదారులే క్రమబద్ధీకరణకు ఫీజు చెల్లించా రు. తద్వారా 18.65శాతమే నమోదైంది. సోమవా రం రాయితీ గడువు ముగిసింది. దాదాపు మరో 13,959 మంది ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫీజు రాయితీ గడువు పెంచాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
దరఖాస్తుల వివరాలు
ప్రాంతం దరఖాస్తులు అనుమతించినవి ఫీజు చెల్లించినవి ఆదాయం (రూ.కోట్లలో)
రామగుండం 7,083 4,187 916 5.3
మంథని 895 732 208 0.6
పెద్దపల్లి 10,278 7,750 2,414 8.71
సుల్తానాబాద్ 1,537 1,156 187 0.79
గ్రామీణం 5,750 4,899 1,040 0.01

స్పందన అంతంతే