
కాంట్రాక్టర్లకు పని.. అధికారులకు కమీషన్
● ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న రైల్వేశాఖ ● మౌలిక సదుపాయాల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం ● రామగుండం రైల్వేస్టేషన్ ఆధునికీకరణ తీరు
రామగుండం: కాంట్రాక్టర్లకు నిత్యం పనికల్పించడం.. అధికారులకు కమీషన్లు ముట్టజెప్పడం.. కట్టడాలను నిత్యం కూల్చడం.. మళ్లీ కట్టడమే రైల్వేస్టేషన్లలో కొనసాగుతున్న తంతు.. అమృత్ భా రత్ పథకంలో రూ.కోట్లు వెచ్చించి స్థానిక రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతోంది. రెండేళ్ల క్రితం నాటికి ప్రస్తుతానికి ఎంతో ఆధునికత సంతరించుకుంది. ఇది నాణేనికి ఒకవైపే.. ఉద్యోగుల సంక్షేమంపై నిర్లక్ష్యం ప్రదర్శించడం, కనీస సౌకర్యాలు విస్మరించడం నాణేనికి మరోవైపు.. ఇది రైల్వేశాఖ ద్వంద్వ నీతికి అద్దంపడుతోందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
తాగునీటి సరఫరా లేదు..
రైల్వే కార్మిక కుటుంబాలకు మిషన్ భగీరథ లేదా మినరల్ వాటర్ అందించడంలేదు. మూడేళ్ల క్రితం రెండుచోట్ల ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు నిర్వహ ణ లోపంతో మూలన పడ్డాయి. వాటి మరమ్మతును పట్టించుకునే వారు కరువయ్యారు. ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన కార్మికుల క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలుతాయో తెలియకుండా ఉంది. ప్రమాదపు అంచన ఉన్న కొన్నింటిని కూల్చివేసిన అధికారులు.. శిథిలాలను అలాగే వదిలేశారు. దీంతో అందులో పాములు, తేళ్లు, విషపురుగులు దూరి స్థానికులను భయపెడుతున్నాయి.
పిచ్చిమొక్కలు.. కోతులకు ఆవాసాలు..
రైల్వేస్టేషన్ సుందరీకరణపైనే అధికారులు దృష్టి సారిస్తున్నారు. కానీ, కార్మిక కుటుంబాల క్వార్టర్ల మధ్య పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగినా, అపరిశుభ్రత తాండవిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఎస్సీ, బీసీ కార్మిక సంఘాల కార్యాలయాల వెనకాల ఇలాంటి మొక్కలు అడవిని తలపిస్తున్నాయి. వందలాది కోతులు దానిని ఆవాసంగా ఏర్పాటు చేసుకుని కార్మిక కుటుంబాలపై దాడులు చేస్తున్నాయి. తరచూ రేకుల షెడ్డుపై కోతులు విన్యాసాలు చేయడంతో సమీపంలోని లోకో పైలెట్లు, గార్డులు విశ్రాంతి తీసుకోలేక అసౌకర్యానికి గురవుతున్నారు. నిద్ర భంగం కావడంతో విధులు సరిగా నిర్వర్తించే పరిస్థితి లేకుండా తయారవుతోందని ఆవేదన చెందుతున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదని మండిపడుతున్నారు. అంతేకాదు.. విద్యుత్ తీగలు పట్టుకుని వేలాడడం, సోలార్ ప్యానెళ్లపై గంతులు వేయడంతో తరచూ షార్ట్‌సర్క్యూట్ జరుగుతూ రైల్వే ఆస్తులకూ నష్టం వాటిల్లుతోంది.
తెరచుకోని మరుగుదొడ్లు..
రెండో ప్లాట్‌ఫారంపై ప్రయాణికుల కోసం నిర్మించిన మరుగుదొడ్ల కాంప్లెక్స్ ఇంకా తెరచుకోవడం లేదు. ఫలితంగా వరంగల్, విజయవాడ, హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు ఒకటి, రెంటికి ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై ఉన్న టాయిలెట్స్‌కు పరుగులు పెడుతున్నారు. ప్రమాదాల బారినపడుతున్నారు.
రూ.26.5 కోట్లతో ఆధునికీకరణ..
రైల్వేస్టేషన్‌లో ఏటా ఏదోఒక నిర్మాణం చేపడుతు న్నారు. దీంతో కాంట్రాక్టర్లకు చేతినిండా పని లభి స్తుండగా.. అధికారులకు కమీషన్ల రూపంలో వద్ద న్నా ఆదాయం వచ్చిపడుతోంది. ప్రస్తుతం అమృత్ భారత్ పథకంలో రూ.26.5 కోట్లు వెచ్చించి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు నిర్వహిస్తున్నారు. దీనిద్వారా సిమెంట్ పనులు చేసిన మరుసటి రోజే పెయింటింగ్స్ వేస్తున్నారు. ఐదు రోజులైనా నీటితో క్యూరింగ్ చేయాల్సి ఉన్నా.. ఆ పనిచేయడంలేదు. తద్వారా నాణ్యతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవారంలోగా ప్రధాని, రైల్వేశాఖ మంత్రి వర్చువల్ విధానంలో రైల్వేస్టేషన్‌ను ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

కాంట్రాక్టర్లకు పని.. అధికారులకు కమీషన్

కాంట్రాక్టర్లకు పని.. అధికారులకు కమీషన్

కాంట్రాక్టర్లకు పని.. అధికారులకు కమీషన్