
జీతం ఇమ్మంటే లంచం అడిగాడు
● జమ్మికుంటలో ఏసీబీకి చిక్కిన సెర్ప్ ఉద్యోగి ● రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
జమ్మికుంట: సెర్ప్‌లో వీఏవోగా పనిచేస్తున్న మహిళ తనకు రావాల్సిన ఏడాది గౌరవ వేతనం మంజూరు చేయాలని అడిగితే లంచం డిమాండ్ చేశాడో సెర్ప్ ఉద్యోగి. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. సదరు అధికారి మహిళ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వివి.రమణమూర్తి వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలంలోని పెద్దంపల్లి గ్రామానికి చెందిన దొడ్డె స్వప్న సెర్ప్‌లో వీఏవోగా పనిచేస్తోంది. ఏడాదికి సంబంధించిన రూ.60వేల గౌరవ వేతనం రావాల్సి ఉంది. ఇందుకోసం జమ్మికుంట సెర్ప్ కమ్యూనిటీ కో– ఆర్డినేటర్ పసరకొండ సురేశ్‌ను సంప్రదించింది. గౌరవ వేతనం ఇవ్వాలంటే రూ.20వేలు డిమాండ్ చేశాడు. మొదట రూ.4 వేలు ఇచ్చింది. మిగితా రూ.16వేలు ఇవ్వాలని వేధించడంతో ఏసీబీని ఆశ్రయించింది. వీఏవో నుంచి మంగళవారం రూ.10వేల లంచం తీసుకుంటుండగా సీసీ సురేశ్‌ను ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, కరీంనగర్ కోర్టుకు తరలించారు. తనకు రావాల్సిన గౌవర వేతనం ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉందని, మంజూరు కోసం సీసీ సురేశ్ డబ్బులు డిమాండ్ చేశాడని స్వప్న వెల్లడించింది. ఏసీబీ దాడుల్లో సీఐలు కృష్ణకుమార్, పున్నం చందర్ పాల్గొన్నారు.

జీతం ఇమ్మంటే లంచం అడిగాడు