
నిబంధనల ప్రకారం కేసుల పరిష్కారం
జ్యోతినగర్(రామగుండం): బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ సూచించారు. ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు కోయ శ్రీహర్ష, కుమార్ దీపక్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ అరుణశ్రీ, పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీలు కరుణాకర్, భాస్కర్, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ బాబు, రీసెర్చ్ అధికారి డి.వరప్రసాద్‌తో కలిసి మంగళవారం ఆయన కేసుల పురోగతిపై సమీక్షించారు. గతంలో జరిగిన సమావేశంలో జారీచేసిన సూచనలు, పనుల పురోగతి, తమ శాఖ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను పలువురు అధికారులు వివరించారు. ఈ సందర్బంగా వడ్డెపల్లి రాంచందర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పకడ్బందీగా నమోదు చేసి, నిందితులకు చట్టం ప్రకారం శిక్ష పడేలా సాక్ష్యాలను ప్రవేశ పెట్టాలన్నారు. నిమ్నవర్గాల యువత పరిశ్రమలు స్థాపించేలా ప్రభుత్వాలు అందించే రాయితీలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రామగుండం, బెల్లంపల్లిలోని ఇండస్ట్రియల్ పార్క్‌ల్లో ఎస్సీ ఔత్సాహికవేత్తలకు భూ కేటాయింపుల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన, స్టాండప్ ఇండియా, ముద్ర రుణాలను వ్యాపారవేత్తలకు అందించాలన్నారు. అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం, కులాంతర వివాహాలకు సకాలంలో సాయం అందేలా చూడాలన్నారు. దళితుల భూములు ఆక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేయడం లేదనే మాట వినపడుతోందని, తప్పుడు కేసు కాకుంటే నిందితులను అరెస్టు చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావాలని ఆయన అన్నారు. ప్రభుత్వ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని ఆదేశించారు. శాఖల వారీగా బ్యాక్‌లాగ్ పోస్టులు, కారుణ్య నియామకాలు, పదోన్నతుల పెండింగ్ వివరాలను అందించాలని కోరారు. ఎన్టీపీసీ, సింగరేణి తదితర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం చేపట్టే భూసేకరణలో దళితులకు న్యాయమైన పరిహారం అందజేయాలని అన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం అందించామని, రేషన్ డీలర్లుగా వారికి ఉపాధి కల్పించామని, వారి పిల్లలకు గురుకులాలు, కేజీబీవీల్లో చేర్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం కింద 2024–25లో ఐదుగురు దరఖాస్తు చేసుకోగా ముగ్గురిని ఎంపిక చేసి రూ.47 లక్షలు చెల్లించామని తెలిపారు. కులాంతర వివాహాల కింద ఈ ఏడాది 16 జంటలకు రూ.40 లక్షలు పంపిణీ చేశామని వివరించారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్

నిబంధనల ప్రకారం కేసుల పరిష్కారం