
హనుమాన్ చిన్న జయంతికి ఏర్పాట్లు చేయండి
జగిత్యాల: హనుమాన్ చిన్న జయంతికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. ఈనెల 11 నుంచి జయంతి కార్యక్రమాల నేపథ్యంలో పదో తేదీలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కిందిస్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు రోజులపాటు లైటింగ్, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని, 11న రాత్రి నుంచి 13వ తేదీ ఉదయం వరకు సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, సుమారు 45వేల మంది భక్తులు మాలవిరమణ చేస్తారని, మూడు రోజులపాటు 14 కౌంటర్లను ఏర్పాటు చేసి సుమారు 5 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఆలయ ప్రాంగణంలో 64 సీసీకెమెరాలు ఉన్నాయని, అదనంగా 50 సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తామని, ఆరు మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. మూడురోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, ఇందుకోసం వేదిక ఏర్పాటు చేసి వందమంది కూర్చునేలా సిట్టింగ్ ఉండాలని సూచించారు. చలువ పందిళ్లు, కోనేరు వద్ద పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, కల్యాణ కట్ట వద్ద నాయీబ్రాహ్మణులను ఎక్కువగా నియమించుకోవాలని ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో షిఫ్ట్‌ల వారిగా కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రఘుచందర్, కొండగట్టు ఆలయ ఈవో శ్రీనివాస్‌రావు, మదన్‌మోహన్, మున్సిపల్ కమిషనర్ స్పందన పాల్గొన్నారు.
జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్