
శుచి.. శుభ్రతకు తిలోదకాలు
కోల్‌సిటీ(రామగుండం): హోటల్, బేకరీ, పాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లి ఏదైనా ఆహారం తినాలని అనుకుంటున్నారా? అయితే, చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఆహారం తయారీలో వినియోగించే పదార్థాలు నాసిరకంగా ఉంటున్నాయి. గడువు దాటిన, పురుగులు పట్టిన వాటితోపాటు కల్తీ మసాలాలు, అనేకసార్లు కాచిన నూనె వినియోగిస్తున్నారు. శుభ్రత అస్సలు పాటించడంలేదు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగులు వాడుతున్నట్లు రామగుండం నగర పాలక అధికారులు బుధవారం చేసిన తనిఖీల్లో గుర్తించారు.
ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం..
బల్దియా పరిధిలోని కొన్ని హోటళ్లు, బేకరీలు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం సాగిస్తున్నాయి. నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ముఖ్యంగా బేకరీల్లోని ఎగ్‌పఫ్, కర్రీపఫ్ తదితర పదార్థాలు పాచిపోయినా పడేయకుండా వేడిచేసి విక్రయిస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో పరిస్థితి మరీదారుణంగా ఉంది. అనేకసార్లు కాచిన నూనెను నూడిల్స్, ఫ్రైడ్‌రైస్, మంచూరియా తయారీకి వినియోగిస్తున్నారు. వినియోగదారులను ఆకర్షించేందుకు సహజ రంగులకు బదులు సింథటిక్ రంగులు వాడుతున్నారని ఆరోపణలున్నాయి. బిర్యానీ సెంటర్లు, హోటళ్లలోనూ అదే దుస్థితి నెలకొంది. నాణ్యతలేని కూరగాయలు, దినుసులు, కాలంచెల్లిన మసాలాలు, ఇతర సరుకులు వినియోగిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు బల్దియా అధికారులు చేసిన దాడుల్లో నాణ్యతలేమి, గడువుతీరిన ముడిసరుకులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
బేకరీ నిర్వాహకుడికి రూ.20 వేల జరిమానా
గోదావరిఖని లక్ష్మీనగర్‌లోని సిరి కేక్స్, మోర్‌షాప్ నిర్వాహకుడికి రామగుండం నగర పాలక సంస్థ అధికారులు బుధవారం రూ.20వేల జరిమానా విధించారు. కమిషనర్ (ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ ఆదేశాల మేరకు హెల్త్ అసిస్టెంట్ కిరణ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. బేకరీలో గడువు దాటిన ముడిపదార్థాలు, అపరిశుభ్ర వంటశాలలో కేక్‌లు, మిఠాయిలు తయారు చేస్తూ, నిషేధిత సింగిల్ యూస్ ప్లాస్టిక్ సంచుల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కాలంచెల్లిన రసాయనాలు, ఇతర పదార్థాలు వినియోగిస్తున్నారని తేల్చారు. ఈ మేరకు జరిమానా విధించారు. ఎన్విరా న్మెంటల్ ఇంజినీర్ మధుకర్, ఎంఐఎస్ ఆ పరేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
4X14CLFDS FM KRZ
ఈ రెండు డబ్బాల్లో కనిపిస్తున్న ఆహార పదార్థాన్ని ఎగ్‌పఫ్, కర్రీపఫ్‌లో పెట్టి విక్రయిస్తున్నారు. మంగళవారం తయారు చేసిన బేకరీ నిర్వాహకులు.. మిలిగిన ఆహారాన్ని బుధవారం ఉపయోగించడానికి ఫ్రిజ్‌లో నిల్వచేశారు. అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెలుగుచూసింది.

శుచి.. శుభ్రతకు తిలోదకాలు