పట్నా: తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, బిహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ అధికారపీఠాన్ని అందుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే అతి చిన్న వయసులో సీఎంగా రికార్డులకెక్కేవారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా 200 ర్యాలీల్లో పాల్గొని, ఆర్జేడీ కుల సమీకరణలకు భిన్నంగా పది లక్షల ఉపాధి అవకాశాలపై హామీలిచ్చి, యువతరం మదిని మెప్పించినప్పటికీ ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. బిహార్ రాజకీయాలను సుదీర్ఘకాలంపాటు శాసించిన రాజకీయ దురంధరుడు లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిల కుమారుడు తేజస్వి.
చదువు పెద్దగా అచ్చిరాక, అర్ధంతరంగా 10వ తరగతిలోనే చదువుకి స్వస్తిపలికిన తేజస్వి యిప్పుడు దేశంలోనే అతి తక్కువ వయస్సున్న ప్రతిపక్ష నేత. ఆయన రాజకీయారంగేట్రం 2015లో జరిగింది. 2018 నుంచి ఆర్జేడీ అధినాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఆర్జేడీ గెలుపుని ఖాయం చేసినా, ఆ పార్టీ అధికారానికి ఆమడ దూరంలో ఉండిపోయింది. అయితే బిహార్‌లో ఆర్జేడీని అతిపెద్ద పార్టీగా నిలపగలిగారు. క్షేత్ర స్థాయిలో నితీశ్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తేజస్వి అనుకూల ఓటుగా మలుచుకోలేకపోయారు. మహాగఠ్ బంధన్ వైఫల్యం తేజస్వి వైఫల్యంగానే చూడాలని నిపుణులు అంటున్నారు.
మహాకూటమి ఎందుకు ఓడిందంటే...
1. పేదరికం, ఉపాధి కల్పన, వలస కార్మికుల సంక్షోభం లాంటి విషయాలపై తేజస్వి ఎక్కువ దృష్టిపెట్టి, కులాలకు అతీతంగా ప్రచారం చేశారు. ఈ ఎత్తుగడ కలిసిరాలేదు.
2. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లలో పోటీపడి 19 మాత్రమే గెలవడం ఓటమికి ప్రధాన కారణమంటున్నారు.
3. ఏఐఎంఐఎం కూడా ముస్లిం ఓటర్ల ప్రాబల్య ప్రాంతాల్లో పోటీచేసి, 5 స్థానాలు పొందడంతో పాటు, మిగిలిన చోట్ల ఓట్లు చీల్చింది.
4. ఆర్జేడీ గెలిస్తే జంగిల్ రాజ్ వస్తుందంటూ బీజేపీ చేసిన ప్రచారం కూడా ఆర్జేడీకి ప్రతికూలంగా మారింది.
5. తేజస్వి క్షేత్ర స్థాయిలో జనంతో మమేకమై ఉంటే ఆర్జేడీ గెలుపు ఖాయమయ్యేదని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment