ఎన్నికల్లో పాజిటివ్ ఓటు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఒక పార్టీని గెలిపించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించడం పంజాబ్‌లో ఆవిష్కృతమైంది. ఏడేళ్ల క్రితం రాజధాని ఢిల్లీ వీధుల్లో విపక్ష పార్టీలను ఊడ్చేసినట్టుగా ఇప్పుడు దానికి ఆనుకొని ఉన్న పంజాబ్‌లో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌లను ఆప్ ఊడ్చి పారేసింది. ఎనిమిదేళ్లుగా పంజాబ్ కోటలో పాగా వేయాలన్నకేజ్రివాల్ ప్రయత్నాలు ఫలించాయి. ఢిల్లీ మోడల్ పాలన హామీలతో సామాన్యుడు చిరుదరహాసంతో మీసం మెలేశాడు.
ఇది మామూలు విజయం కాదు. ఎవరి ఊహకి అందని అసాధారణ విజయం. కాంగ్రెస్ దళిత కార్డు రాజకీయాల్ని, శిరోమణి అకాలీదళ్ సంప్రదాయ వ్యూహాలను, కెప్టెన్ అమరీందర్ ప్రజాకర్షణని ఒకేసారి తుడిచిపెట్టేస్తూ కుల, మత, ప్రాంతీయ రాజకీయ సమీకరణలకి అతీతంగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయభేరి మోగించింది. కాంగ్రెస్ కంచుకోటల్ని బద్దలు కొట్టి అఖండ మెజార్టీతో విజయం సాధించింది. 70 ఏళ్ల పాటు రెండు ప్రధాన పార్టీలనే ఆదరించిన పంజాబ్‌కు ఆప్ ఒక ఆశాకిరణంలా కనిపించింది. ఢిల్లీ మోడల్ పరిపాలనను చూసి ఆ పార్టీని అక్కున చేర్చుకున్నారు పంజాబీలు.
చదవండి: పెరుగుతున్న 'ఆప్' గ్రాఫ్.. తర్వాత టార్గెట్ ఆ రెండే..
మార్పు కోసం
పంజాబ్‌లో గత 70 ఏళ్లుగా రెండు పార్టీలే రాజ్యమేలాయి. శిరోమణి అకాలీదళ్ లేదంటే కాంగ్రెస్ ఈ రెండు పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఏడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్‌లు నాణేనికి చెరోవైపు ఉన్న పార్టీలేనని పంజాబ్ ప్రజలు భావించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. రోజు రోజుకి పడిపోతున్న ప్రజల తలసరి ఆదాయం, ఏళ్ల తరబడి రాజకీయ పక్షాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం చూసి చూసి విసిగెత్తిన ప్రజలు ఆప్‌వైపు మళ్లారు. ఈ సారి ప్రజలు ఫూల్స్ అవకుండా భగవంత్ మన్, కేజ్రివాల్‌కే అవకాశం ఇస్తారన్న ఆప్ ప్రచార వ్యూహం ఫలించింది.
ఢిల్లీ మోడల్
ఢిల్లీలో ఆప్ చేసిన అభివృద్ధి పొరుగునే ఉన్న పంజాబ్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ గత కొన్నేళ్లుగా పంజాబ్ మీదే దృష్టి పెట్టారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ తరహా పాలనను పంజాబ్‌లో తీసుకువచ్చి అభివృద్ధి బాట పట్టిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇచ్చిన హామీలను ప్రజలు బలంగా నమ్మారు. నాణ్యమైన ప్రభుత్వ విద్య, ఆరోగ్యం, నెలకి 300 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్, తక్కువ చార్జీలకే తాగునీరు అనే నాలుగు స్తంభాల మీద ఢిల్లీ పరిపాలన సాగింది.
చదవండి: ఆప్ అఖండ విజయం.. 60ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన కేజ్రీవాల్
విద్యుత్ చార్జీల భారం, ఆరోగ్యం, విద్య ప్రైవేటీకరణతో నిత్యం ఆర్థిక భారాన్ని మోస్తున్న ప్రజలు కేజ్రివాల్ హామీలకు ఆకర్షితులయ్యారు. డ్రగ్స్ మాఫియాను అరికట్టడం, గురుగ్రంథ్‌సాహిబ్‌ను అవమానించిన వారిని శిక్షిస్తామన్న చెప్పడంతో మరో ఆలోచన లేకుండా చీపురుకి ఓట్లు గుద్ది పారేశారు.
రైతు ఆందోళన
పంజాబ్‌లో వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘంగా ఏడాదిపాటు చేసిన పోరాటం అధికార మార్పుకి దోహద పడింది. రైతు ఆందోళనలకు మొదట్నుంచీ ఆప్ మద్దతు ఇచ్చింది. రాష్ట్రంలో 69 స్థానాలున్న అత్యంత కీలకమైన మాల్వా ప్రాంతానికి చెందిన అతి పెద్ద రైతు సంఘం బీకేయూ (ఉగ్రహాన్), ప్రజా మద్దతు అధికంగా ఉన్న ఈ సంఘం అధ్యక్షుడు జోగీందర్ సింగ్ ఉగ్రహాన్ 70 ఏళ్ల తర్వాత కూడా నాయకుల్లో మార్పు రాకపోతే ఏం చెయ్యాలంటూ ఓటర్లలో ఆలోచన రేకెత్తించేలా ప్రసంగాలు చేశారు. ఆ ప్రశ్నలన్నింటికీ ఆప్ సమాధానమైంది.
సీఎం అభ్యర్థిగా భగవంత్ మన్
పంజాబ్‌లో ఆప్‌పై బయట పార్టీ అన్న ముద్ర ఉంది. పరాయివారు మనల్ని పరిపాలించడానికి అవకాశం ఇస్తారా అంటూ ఇతర పార్టీలు పదే పదే ఆప్‌పై బురదజల్లేవి. గత ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికల బరిలో దిగి తప్పు చేసిన ఆప్ ఈ సారి దానిని దిద్దుకుంది. భగవంత్ మన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలకు ముందే ప్రకటించి తమ పార్టీపై ఉన్న ఆ ముద్రను చెరిపేయడానికి కేజ్రివాల్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఒక కమెడియన్‌గా, రాజకీయ నాయకుడిగా భగవంత్ మన్‌కు పంజాబీయుల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. సంప్రదాయ రాజకీయ నాయకుల్ని చూసి చూసి విసిగిపోయిన ప్రజలకి భగవంత్‌మన్‌లో హాస్యస్ఫూర్తి, ఒక మట్టి మనిషిగా ఆయన జీవన విధానం చూసి అభిమానాన్ని పెంచుకున్నారు.
భగత్ సింగ్ సొంతూళ్లో ప్రమాణం
చండీగఢ్: ‘పంజాబ్ కొత్త కేబినెట్ ప్రమాణస్వీకార కార్యక్రమం రాజ్‌భవన్‌లో జరగదు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలన్‌లో నిర్వహిస్తాం’ అని ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ వెల్లడించారు. కార్యక్రమం తేదీలను తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఏ సర్కారు ఆఫీసులో కూడా ముఖ్యమంత్రి చిత్రపటాలు ఉండవని స్పష్టం చేశారు. బదులుగా భగత్‌సింగ్, అంబేద్కర్ ఫొటోలు ఉంటాయన్నారు. ఇప్పుడిక పంజాబ్‌ను మళ్లీ పంజాబ్‌గా మారుస్తామని చెప్పారు. పంజాబ్ ప్రజలు ఆప్‌కు పట్టం కట్టారని ట్రెండ్‌ను బట్టి తెలియడంతో ధురిలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో మాన్ మాట్లాడారు.
పాఠశాలల స్థితిగతులను మెరుగుపరచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంచడం, పరిశ్రమలను తీసుకురావడం, సాగును లాభసాటిగా మార్చడం, మహిళలకు భద్రత కల్పించడం, క్రీడా మౌలిక సదుపాయాలను పెంచడం ప్రాధాన్యాంశాలని ఆయన వివరించారు. క్రీడలను ప్రోత్సహించడానికి గ్రామాల్లో ట్రాక్స్, స్టేడియంలు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో మంత్రులు ఎప్పటికప్పుడు పర్యటిస్తుంటారని.. ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటారని చెప్పారు. ‘ఆప్‌కు ఓటేయని వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాల ప్రజల కోసం పార్టీ పని చేస్తుంది’ అని చెప్పారు. ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను తిరిగి తీసుకురావడంపై స్పందిస్తూ.. ‘మన పిల్లలు చదువుకోవడానికి బయటకు ఎందుకు వెళ్లాలి. మనమే తక్కువకు సదుపాయాలు ఎందుకు కల్పించకూడదు’ అన్నారు.
యువత, మహిళలు
రాష్ట్రంలో మహిళలు, యువత ఆప్ వెంట నడవడంతో ఈ స్థాయి విజయం పార్టీకి సాధ్యమైంది. అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తామని, భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తామని కేజ్రివాల్ చేసిన హామీలతో యువతరం ఆప్ వెంటే నడిచింది. ఉద్యోగాల్లో కోచింగ్ సెంటర్లకు ఫీజులు కడతామన్న ఉచిత పథకాలు యువతని ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు మరే పార్టీ చేయని విధంగా మహిళలను ప్రత్యేకమైన ఓటు బ్యాంకుగా కేజ్రివాల్ గుర్తించారు. ఆప్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిరుపేద మహిళలకు ప్రతీ నెల రూ.వెయ్యి బ్యాంకులో వేస్తానన్న హామీ ఇచ్చారు. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రంలో మహిళలకి కాస్తో కూస్తో ఆర్థిక స్వాతంత్య్రం వస్తుందన్న ఆశ వారిని ఆప్ వైపు మొగ్గేలా చేసింది.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment