చెన్నై: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని, దీనిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయ్ ధ్వజమెత్తారు. మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు స్టాలిన్ సర్కార్ ఏ ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు.
విజయ్ మాట్లాడుతూ.. 'ఇటీవల కాలంలో తమిళనాడు యువతలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంది. ఒక పేరెంట్‌గా, రాజకీయ పార్టీ నాయకుడిగా నేనే దీని గురించి భయపడుతున్నాను. యువతను డ్రగ్స్ నుంచి రక్షించడం ప్రభుత్వ కర్తవ్యం. కానీ ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో మంచి నాయకులు రావాల్సిన అవసరం ఉందిస అని పేర్కొన్నారు.
కాగా స్టాలిన్ ప్రభుత్వంపై విజయ్ నేరుగా విమర్శలు చేయడం ఇదే తొలిసారి. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టాలని యోచిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. తమిళనాడులోని కళ్లకురిచిలో ఇటీవల కల్తీ సారా తాగడం వల్ల 60 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ మరణాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టి, వారంలోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. నివేదికను దాఖలు చేసేందుకు మద్రాసు హైకోర్టు జూలై 3 వరకు గడువు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment