![Addanki Dayakar and Balmoor Venkat set for nominated MLC posts - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/17/ADDANKI.jpg.webp?itok=pgaCIPXa)
అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు పేరు తెరపైకి వచ్చింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ పేరు దాదాపు ఖరారైందని ప్రచారం జరిగినా, మంగళవారం అనూహ్యంగా వెంకట్ రేసులోకి వచ్చారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌తో పాటు వెంకట్‌ను రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.
ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం నుంచే ప్రచారం జరిగినా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఇద్దరికీ ఏఐసీసీ నుంచి వ్యక్తిగతంగా సమాచారం అందిందని, నామినేషన్లు సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. ఈ నెల 18న నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఏ క్షణమైనా ఈ ఇద్దరి పేర్లను ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని తెలుస్తోంది. నిజానికి మంగళవారమే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని, బుధవారం అధికారిక ప్రకటన వస్తుందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి.
జగ్గారెడ్డికి బీ ఫారాలపై సంతకాల అధికారం
ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు సమర్పించనున్న బీఫారాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి సంతకాలు చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో బీఫారాలిచ్చే అధికారాన్ని ఏఐసీసీ జగ్గారెడ్జికి ఇచి్చంది. ఇక నామినేషన్ల దాఖలు, ఎమ్మెల్యేల చేత ప్రతిపాదిత సంతకాలు చేయించే వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించినట్టు సమాచారం.
కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అతిపిన్న వయస్కుడిగా మండలిలో అడుగుపెట్టే ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ రికార్డు సృష్టించనున్నారు. దేశంలోనే శాసనమండలికి ఎన్నికైన వారిలో ఇంత చిన్న వయస్సు ఉన్న వారెవరూ లేరు. ప్రస్తుతం వెంకట్ వయసు 30 సంవత్సరాల 9 నెలలు. ఇప్పటివరకు 33 ఏళ్ల వయసులో ఒకరు గుజరాత్ శాసనమండలికి ఎన్నిక కావడమే రికార్డు అని, ఇప్పుడు ఆ రికార్డును వెంకట్ అధిగమిస్తారని గాంధీభవన్ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment