సాక్షి, చెన్నై: తమ జెండా ఉపయోగించకుండా చిన్నమ్మ శశికళకు చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకే నిర్ణయించింది. దీనిని అడ్డుకోవాలని కోరుతూ డీజీపీ త్రిపాఠికి అన్నాడీఎంకే నేతలు, మంత్రులు గురువారం ఫిర్యాదు చేశారు. ఇక చిన్నమ్మను ఆహ్వానించేందుకు భారీ ఏర్పాట్లపై అమ్మ మక్కల్ మున్నేట్ర కళం నిమ్నగమైంది. వేలూరులో అయితే, హెలికాప్టర్ ద్వారా పువ్వుల వర్షం కురిపించేందుకు ఏకంగా కలెక్టర్ అనుమతి కోరడం గమనార్హం. అక్రమాస్తుల కేసు నుంచి విడుదలైన శశికళ ఈనెల 8న చెన్నైకి రానున్నారు. ఆమెకు ఆహ్వానం పలికేందుకు అమముక వర్గాలు భారీగానే ఏర్పాట్లపై దృష్టిపెట్టాయి. వేలూరులో అయితే, జిల్లా సరిహద్దు మాదనూరు నుంచి హెలికాప్టర్ ద్వారా పువ్వులవర్షం కురిపించేందుకు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ కళగం జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి జయంతి పద్మనాభన్ కలెక్టర్ షణ్ముగసుందరానికి గురువారం విన్నవించుకున్నారు. (చదవండి: రాళ్లు వేయించాడు.. కాళ్లు పట్టుకుంటున్నాడు..)
జెండాకు చెక్..
ఆహ్వాన ఏర్పాట్లు ఓ వైపు సాగుతుంటే, ఎక్కడ అన్నాడీఎంకే జెండాలతో చిన్నమ్మ దూసుకొస్తుందో అన్న బెంగ ఆ పార్టీ వర్గాల్లో నెలకొన్నట్టుంది. జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో అన్నాడీఎంకే జెండా ఉన్న కారులో చిన్నమ్మ పయనించడం వివాదానికి దారి తీసింది. దీనిపై ఫిర్యాదులు కూడా హోరెత్తాయి. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ తమ పార్టీ జెండా ఊపయోగించకుండా చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకే నిర్ణయించింది. ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, సంయుక్త కన్వీనర్లు కేపీ మునుస్వామి, వైద్యలింగం, మంత్రులు సీవీ షణ్ముగం, జయకుమార్, తంగమణి, వేలుమణి గురువారం సాయంత్రం డీజీపీ త్రిపాఠిని కలిసి ఫిర్యాదు చేశారు.(చదవండి: షాకిచ్చిన ఎమ్మెల్యేలు.. యడ్డీ కుర్చీకి ఎసరు!)
తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి పార్టీ జెండాను ఉపయోగిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు. కేపీ మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ అ న్నాడీఎంకే జెండాను ఉపయోగించే అర్హత పార్టీ కార్యకర్తలు, నాయకులకు మాత్రమే ఉందన్నారు. అయితే, తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి జెండాను ఉపయోగించే అర్హత లేదని, అందుకే డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మంత్రి సీవీ షణ్ముగం మాట్లాడుతూ అన్నాడిఎంకే పార్టీ పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలోని సమన్వయ కమిటీకే చెందుతుందని, ఇప్పటికే ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిందని, కోర్టులు సైతం స్పందించాయని గుర్తు చేశారు. ఇప్పటికే జయలలిత సమాధి వద్దకు చిన్నమ్మ వెళ్లకుండా పనుల పేరిట అడ్డుకట్ట వేసిన పాలకులు, తాజాగా జెండా వాడకానికి చెక్ పెట్టే పనిలో పడడం గమనార్హం.
నేడు వదినమ్మ విడుదల..
శశికళతో పాటు ఆమె వదినమ్మ ఇలవరసి, అక్కకుమారుడు సుధాకరన్ జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగియడంతో వదినమ్మ శుక్రవారం ఉదయం జైలు నుంచి బయటకు రానున్నారు. నేరుగా ఆమె చిన్నమ్మ బస చేసి ఉన్న ఫామ్ హౌస్‌కు వెళ్లనున్నారు. ఈ ఇద్దరు విడుదలైనా, సుధాకరన్ విడుదలలో జాప్యం తప్పడం లేదు. ఇందుకు కారణం, ఆయన చెల్లించాల్సిన జరిమానా ఇంకా కోర్టుకు చేరలేదు.
Comments
Please login to add a commentAdd a comment