సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మూడో జాబితాపై కూడా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. జాబితాలో పేర్లు లేని ఆశావహులు, వారి అనుచరులు ఆందోళనలు చేపట్టారు. అటు గాంధీభవన్, ఇటు రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఈ ఆందోళనలు జరిగాయి. జి చిన్నారెడ్డి (వనపర్తి), సంజీవరెడ్డి (నారాయణఖేడ్), కాట శ్రీనివాస్‌గౌడ్ (పటాన్‌చెరు), బెల్లయ్య నాయక్ (డోర్నకల్), మానవతా రాయ్ (సత్తుపల్లి)లు తమ అనుచరులతో కలిసి, వ్యక్తిగతంగా తమ నిరసనలు పార్టీ అధిష్టానానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గాం«దీభవన్‌లోని ప్రధాన గేటులో ఒకదానికి తాళం వేయగా, జూబ్లీహిల్స్‌లో రేవంత్ నివాసానికి వెళ్లే నాలుగువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
చిన్నారెడ్డి అనుచరుల నిరసన
వనపర్తి టికెట్ ఆశించిన చిన్నారెడ్డి అనుచరులు ఉదయం రేవంత్ ఇంటివద్ద ఆందోళనకు దిగారు. తమ నాయకుడికి ఇచ్చిన టికెట్‌ను మార్చి ఇతరులకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వినతిపత్రం సమర్పించారు. రేవంత్ మాట్లాడుతూ చిన్నారెడ్డి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
అక్కడి నుంచి గాందీభవన్‌కు చేరుకున్న చిన్నారెడ్డి అనుచరులు మెట్లపై కూర్చొని తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో చిన్నారెడ్డి జోక్యం చేసుకొని వారిని వారించారు. ఇలావుండగా వనపర్తి టికెట్ దక్కించుకున్న మేఘారెడ్డికి బీ ఫాం అందింది. మంగళవారం గాందీభవన్‌లో మేఘారెడ్డి సోదరుడు మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి బీ ఫాం అందజేశారు.
కాట వర్గీయుల మండిపాటు
పటాన్‌చెరు టికెట్ ఆశించిన కాట శ్రీనివాస్‌గౌడ్ అనుచరులు సోమవారం అర్ధరాత్రే స్థానికంగా నిరసనలకు దిగారు. పార్టీ జెండాలను దహనం చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి ఇంటిని, గాం«దీభవన్‌ను ముట్టడించారు. రేవంత్ ఆలంపూర్ పర్యటనకు వెళ్లిన తర్వాత ఆయన నివాసం వద్దకు వచ్చిన శ్రీనివాస్‌గౌడ్, అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పార్టీలో కొత్తగా చేరిన నీలం మధుకు టికెట్ ఎలా ఇస్తారంటూ లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకొని వారిని అక్కడి నుంచి పంపించారు. అనంతరం వారు గాందీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. పారాచూట్లకు టికెట్లు అమ్ముకున్నారంటూ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు రామచంద్రాపురంలోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
పటాన్‌చెరు టికెట్‌ను అమ్ముకున్నారని ఆరోపించారు. అధినాయకత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో శ్రీనివాస్‌గౌడ్‌కు ఫోన్ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ టికెట్ విషయంలో భరోసా ఆందోళన విరమించారు. కాగా నారాయణఖేడ్ టికెట్ ఆశించి భంగపడిన సంజీవరెడ్డి అనుచరులు కూడా గాందీభవన్ వేదికగా ఆందోళనకు దిగారు. ఖేడ్‌లోనూ నిరసన వ్యక్తం చేశారు.
టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్యకూ వెనుకాడను
తెలంగాణ కాంగ్రెస్ ఎస్టీ విభాగం చైర్మన్‌గా ఉన్న తనకు టికెట్ కేటాయించకపోవడంపై బెల్లయ్య నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్, డోర్నకల్‌లలో ఎక్కడా టికెట్ ఇవ్వకుండా మోసం చేశారంటూ గాంధీ బొమ్మ ఎదుట దీక్షకు దిగారు. తనకు అవకాశం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడనని హెచ్చరించడంతో పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి తీసుకెళ్లారు.
బరిలోకి దిగేది ఖాయం: మానవతారాయ్
సత్తుపల్లి విషయంలో నిర్ణయాన్ని 24 గంటల్లోగా మార్చుకొని తనకు పార్టీ బీఫాం ఇవ్వకపోతే 9, 10 తేదీల్లో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఓయూ విద్యార్థి నేత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కె మానవతారాయ్ హెచ్చరించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొంటూ రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
భీం భరత్‌కు ఎట్టకేలకు బీ ఫాం
చేవెళ్ల టికెట్‌ను భీం భరత్‌కు ఇస్తామని ప్రకటించిన అధిష్టానం బీ ఫాం మాత్రం ఇవ్వలేదు. దీంతో రెండు మూడురోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఆయన మంగళవారం పార్టీ పెద్దలను కలిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే బీఫాం అందజేయడతో గందరగోళానికి తెరపడింది.
దామోదర వర్సెస్ జగ్గారెడ్డి
మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి మధ్య విభేదాలు పొడ చూపాయి. పటాన్‌చెరు కాంగ్రెస్ టికెట్ నీలం మధు ముదిరాజ్‌కు దక్కడంలో తన ప్రమేయం ఉందంటూ కాట శ్రీనివాస్‌గౌడ్ కుటుంబ సభ్యులతో రాజనర్సింహ తనను బద్నాం చేయిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.
ఇది మంచి పద్ధతి కాదని, దమ్ముంటే రాజకీయంగా తేల్చుకోవాలే తప్ప వ్యక్తిగతంగా డ్యామేజీ చేసేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు. మరోవైపు తన అనుచరులు కాట శ్రీనివాస్‌గౌడ్, సంజీవరెడ్డిలకు టికెట్లు దక్కకపోవడంపై రాజనర్సింహ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తన నియోజకవర్గం మునిపల్లి మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసి ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment