![AIADMK 2 MPs Won Assembly Polls To Choose Assembly Or Rajya Sabha - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/5/tn2.jpg.webp?itok=zOH8Fgtr)
సాక్షి, చెన్నై: ఇద్దరు అన్నాడీఎంకే ఎంపీలు ఎమ్మెల్యేలయ్యారు. జోడు పదవులను తమ చేతిలో పెట్టుకున్న ఈ ఇద్దరు ఏ పదవికి రాజీనామా చేయాలో అన్న డైలమాలో ఉన్నారు. ఇక అన్నాడీఎంకే శాసన సభాపక్షం ఈనెల 7వ తేదీ సమావేశం కానుంది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ జాయింట్ కన్వీనర్లుగా వైద్యలింగం, కేపీ మునుస్వామి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2016 ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి వైద్యలింగానికి రాజ్యసభ సీటు దక్కింది. ఈయన పదవీ కాలం మరో ఏడాది ఉంది. గత ఎన్నికల్లో ఓడిన మరో మాజీ మంత్రి కేపీ మునుస్వామిని గత ఏడాది రాజ్యసభకు పంపారు. ఈ ఇద్దరు నేతలు రాజ్య సభకు వెళ్లినా ఢిల్లీలో కన్నా, రాష్ట్రంలోనే అధికంగా ఉంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు హ్యాట్రిక్ ఖాయం అన్న ధీమాతో మంత్రి పదవుల ఆశతో ఈ ఇద్దరు నేతలు తాజా ఎన్నికల్లో పోటీ చేశారు.
అన్నాడీఎంకే సమన్వయ కమిటీలో నిర్ణయం
తాజా ఎన్నికల్లో ఒరత్తనాడు నుంచి పోటీ చేసిన వైద్యలింగం, వేపనహళ్లి నుంచి పోటీ చేసిన కేపీ మునుస్వామి గెలుపొందారు. అయితే డీఎంకే అధికారంలోకి రానుండడంతో ఈ ఇద్దరు నేతలు డైలమాలో పడ్డారు. రాజ్యసభకు రాజీనామా చేయాలా..? ఎమ్మెల్యే పదవికా..? అన్న సందిగ్ధంలో ఉన్నారు. వీరు ఏ పదవికి రాజీనామా చేసినా డీఎంకేకు లాభమే. వైద్యలింగానికి ఏడాది మాత్రమే రాజ్యసభ పదవీకాలం ఉండడంతో ఆయన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఐదేళ్లు పదవీ కాలం ఉన్న కేపీ మునుస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఈ ఇద్దరు నేతలు రాజ్యసభ పదవులకు రాజీనామా చేసిన పక్షంలో డీఎంకేకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం మేరకు ఆ రెండు పదువులు చేజిక్కించుకోవడం ఖాయం.
రాజీనామా చేస్తే ఉప ఎన్నిక అనివార్యం
ఈ దృష్ట్యా రాజ్యసభలో అన్నాడీఎంకే బలం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు అనివార్యం. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు ఏ పదవికి రాజీనామా చేస్తారో..? అన్నది అన్నాడీఎంకే సమన్వయ కమిటీ తీసుకునే నిర్ణయం మేరకు ఆధారపడి ఉంది. ఈ వ్యవహారాన్ని తేల్చడంతో పాటు శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఈనెల 7న సమావేశం కానుంది. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. పళనిస్వామిని అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా, పన్నీరు సెల్వంను ఉప నేతగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం పళనిస్వామి సేలం జిల్లా ఎడపాడిలోని నివాసానికే పరిమితమయ్యారు. దీంతో ఆయన్ను కలిసేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. మిత్ర పక్షం పీఎంకే ఎమ్మెల్యేలు సైతం పళనిని కలిసిన వారిలో ఉన్నారు.
చదవండి: MK Stalin: స్టాలిన్ వరాల జల్లు.. వారికి గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment