![AIADMK releases list of 171 candidates, BJP gets 20 seats - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/11/BJP_AIADMK.jpg.webp?itok=HWSB0ACl)
సాక్షి ప్రతినిధి, చెన్నై: అనేక తర్జనభర్జనల తరువాత ఎట్టకేలకు అన్నాడీఎంకే, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. బీజేపీకి 20 సీట్లు ఖరారయ్యాయి. 171 మందితో అన్నాడీఎంకే అభ్యర్థుల తుది జాబితా బుధవారం విడుదలైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పరంగా తొలిఘట్టమైన సీట్ల సర్దుబాటు, నియోజకవర్గాల కేటాయింపు బుధవారం ఒక కొలిక్కివచ్చింది. అన్నాడీఎంకే సారథులు పళనిస్వామి, పన్నీర్‌సెల్వం 171 స్థానాల్లో అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించారు. ఇప్పటికే పళనిస్వామి, పన్నీర్ సెల్వంలతో కూడిన ఆరు పేర్లతో తొలి జాబితా విడుదలైంది. తుది జాబితాను కలుపుకుని అన్నాడీఎంకే నుంచి 177 మంది పోటీ చేస్తున్నారు.
బీజేపీకి 20 సీట్లు బుధవారం ఖరారు కాగా నియోజకవర్గాల కేటాయింపు కూడా జరిగింది. కూటమి నుంచి డీఎండీకే వైదొలగడంతో తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) సీట్ల సంఖ్యను పెంచాలని పట్టుబడుతోంది. చిన్నపార్టీలకు సైతం సీట్లు కేటాయించాల్సి ఉన్నందున ఆ పార్టీకి 3, 4 సీట్లు మాత్రమే ఇస్తామని అన్నాడీఎంకే అంటోంది. 23 సీట్లు ఖరారు చేసుకున్న పీఎంకే నమూనా జాబితా సిద్ధం చేసుకుని నియోజకవర్గాల కేటాయింపు కోసం ఎదురుచూస్తోంది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము 4.30 గంటల వరకు బీజేపీ, పీఎంకేలతో పన్నీర్‌సెల్వం, పళనిస్వామి భేటీ అయ్యారు. ఇంకా..టీఎంసీ, పుదియనీది కట్చి, ఇండియా కుడియరసు కట్చి సహా పలు చిన్న పార్టీలకు సీట్ల పంపకాలు చేయాల్సి ఉంది.
డీఎంకే జాబితాలో జాప్యం..
ఇక అన్నాడీఎంకే ప్రధాన ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాంగ్రెస్ సహా కూటమిలోని అన్ని మిత్రపక్షాలకు సీట్ల సర్దుబాటు ఖరారు కాగా 174 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను పోటీకి దించేందుకు స్టాలిన్ సిద్ధమయ్యారు. ఉదయసూర్యుడి చిహ్నంపై పోటీచేసే మిత్రపక్షాలను కలుపుకుంటే మొత్తం 187 స్థానాలవుతున్నాయి. 10న జాబితా విడుదల చేస్తామని స్టాలిన్ గతంలో ప్రకటించగా తుది జాబితా సిద్ధం చేసేందుకు మరికొంత సమయం పట్టొచ్చని తెలుస్తోంది. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ 70 మంది అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించారు.
డీఎండీకే ఒంటరిపోరు..
అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుని 234 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం బు«ధవారం సమావేశమయ్యారు. ఇప్పటికే 140 మంది అభ్యర్థుల జాబితా ఖరారైంది. డీఎండీకేను తమ వైపునకు తిప్పుకోవాలని దినకరన్, కమల్ ప్రయత్నిస్తున్నారు. డీఎంకే అధికారంలోకి వస్తే ఆనందమేనని విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకరన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది పరోక్షంగా డీఎంకేకు మద్దతివ్వడమేనని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment