ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే వార్త వినిపిస్తోంది. దీంతో ఇంతకాలం ఆయన ఆయన కన్నౌజ్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. ఆయన ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని, అయితే కన్నౌజ్ సీటు నుంచి ఎవరిని నిలపాలనే దానిపై పార్టీ నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది.
ఇందుకోసం ఆయన కన్నౌజ్‌లోని బూత్ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో కన్నౌజ్ అభ్యర్థిపై చర్చించే అవకాశాలున్నాయంటున్నారు. కన్నౌజ్ సీటు నుంచి అతని బంధువు తేజ్ ప్రతాప్‌కు టిక్కెట్ కేటాయించవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్నౌజ్‌లో ఎన్నికల ఇన్‌ఛార్జ్‌తో జరిగే సమావేశం అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
గత లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కన్నౌజ్ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆమె బీజేపీకి చెందిన సుబ్రతా పాఠక్ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ములాయం సింగ్ మరణానంతరం మెయిన్‌పురి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమె గెలిచి ఎంపీ అయ్యారు.
కాగా రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను అఖిలేష్ యాదవ్ పోటీకి దించవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆజం ఖాన్ అందుకు సిద్ధంగా లేరని సమాచారం. కన్నౌజ్‌లో సమాజ్‌వాదీ నేతలు అఖిలేష్ యాదవ్ ఇక్కడ నుండి పోటీ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ సోదరుడు రాజ్‌వీర్ సింగ్ యాదవ్ కుమారుడు. 2014లో మెయిన్‌పురి స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అతనికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. తేజ్ ప్రతాప్‌కు ఆర్జేడీ నేత లాలూ యాదవ్‌తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. లాలూకు తేజ్ ప్రతాప్ అల్లుడు. లాలూ యాదవ్ కుమార్తె రాజలక్ష్మి యాదవ్‌ను తేజ్ ప్రతాప్ వివాహం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment