ఆలపాటి రాజాతో శాఖమూరి బాబు సురేంద్ర (ఫైల్)
సాక్షి, గుంటూరు(తెనాలి): దశలవారీ మద్య నిషేధంపై అవాకులు చెవాకులు పేలుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు అష్టకష్టాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడే యథేచ్ఛగా అక్రమ మద్యం అమ్మకాలకు తెగబడ్డాడు. గోవా నుంచి కంటైనర్‌లో మద్యం తెప్పించి ఓ రహస్య ప్రదేశంలో అమ్ముతూ ఎస్‌ఈబీ పోలీసులకు ఈనెల 19న రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ వ్యక్తి గతంలో ఓ హత్యకేసులోనూ నిందితుడు. ఇతను తెనాలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అనుచరుడే కావడం గమనార్హం. మహిళలను వెంటేసుకుని ఆలపాటి రాజేంద్రప్రసాద్ మద్యం అమ్మకాలపై ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన వెలుగు చూడడంతో ప్రజల్లో ప్రతిపక్షం నవ్వులపాలవుతోంది.
చదవండి: (పరిటాల సునీత, శ్రీరామ్‌పై కేసు నమోదు)
అసలేం జరిగిందంటే..!
బుర్రిపాలెంకు చెందిన శాఖమూరి బాబు సురేంద్ర తెలుగు యువత తెనాలి రూరల్ మండల అధ్యక్షుడు. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అనుచరుడు. తెనాలి బుర్రిపాలెం రోడ్డులో నివాసం ఉంటాడు. ఇతను వేంపాటి వేణుబాబు, జాస్తి సతీష్, గడ్డిపాటి బాపనయ్య చౌదరి అనే వ్యక్తులతో కలిసి గోవా నుంచి కంటైనర్‌లో మద్యం తీసుకొచ్చాడు. వీరందరూ కలిసి రెడ్డిపాలెం దగ్గర్లో రహస్యంగా అమ్మకాలు చేస్తూ ఈనెల 19న గుంటూరులో ఎస్‌ఈబీ పోలీసులకే మద్యం అమ్మబోయి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. 174 బాక్సుల్లోని 2,800 మద్యం సీసాలను ఎస్‌ఈబీ గుంటూరు–2 టౌన్ సీఐ కర్ణ, అడిషనల్ ఎస్పీ బిందు మాధవ్, ఈఎస్ అన్నపూర్ణమ్మ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు.
గతంలోనూ నేరచరిత్ర
►సురేంద్ర గతేడాది నల్లపాడు పోలీస్ స్టేషను పరిధిలో జరిగిన హత్య కేసులో రెండో నిందితుడు.
►2020 లాక్‌డౌన్ సమయంలోనూ బుర్రిపాలెంరోడ్డులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నేరంపై శాఖమూరి బాబు సురేంద్రపై కేసు నమోదైంది.
►ఆలపాటి రాజా దన్నుతోనే ఇతడు ఇన్ని నేరాలకు పాల్పడుతున్నాడని, అక్రమ మద్యాన్ని గుంటూ రులోని ఆలపాటి రాజాకు చెందిన హోటల్‌కూ సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment