సోలిపేట సుజాత (టీఆర్‌ఎస్), శ్రీనివాస్‌రెడ్డి ( కాంగ్రెస్), రఘునందన్ రావు (బీజేపీ)
దుబ్బాక ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు పరీక్షగా మారింది. ఏడాదిన్నర పాలనపై ప్రజల స్పందనకు ఈ ఎన్నికలను కొలమానంగా ఉంటాయనే ఆలోచనతో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ మంత్రి హరీశ్ రావుకు ఎన్నికల బాధ్యత అప్పగించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ తీసుకురావడమే లక్ష్యంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దుబ్బాక ఎన్నికలో తమ సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగే తొలి ఎన్నిక కావడంతో ఈ ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే.. బీజేపీ కూడా తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతోంది.
సాక్షి, సిద్దిపేట: రెండోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత జరిగే దుబ్బాక ఉప ఎన్నిక ఆ పార్టీ పనితీరుకు నిదర్శనంగా నిలవనుంది. దీనిని రుజువు చేసేందుకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, మెజార్టీ కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలని టీఆర్‌ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. దుబ్బాక నియోజకవర్గంలో 1,90,483 మంది ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి 37,925 ఓట్ల మెజార్టీ, 2018లో 62,500 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇదే ఊపులో పార్టీని నడిపించి గత ఎన్నికల కన్నా మెజార్టీ ఓట్లు సాధించేలా టీఆర్‌ఎస్ ప్యూహ రచన చేస్తోంది. ఎన్నిక బాధ్యతను భుజాన వేసుకున్న మంత్రి హరీశ్‌రావు తనదైన శైలిలో ప్రచారం ముమ్మరం చేశారు. కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువతతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల ప్రజలతో టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేయించారు. ఇలా లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
కాంగ్రెస్ బడా నాయకులంతా దుబ్బాకలోనే..
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న మాణిక్యం ఠాగూర్ వచ్చీ రాగానే జరిగే ఉప ఎన్నిక కావడంతో ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూడు పర్యాయాలు రెండో స్థానంలో ఓట్లు సాధించిన ఆ పార్టీ.. బలమైన లీడర్ లేకపోయినా క్యాడర్ ఉందనే రుజువైంది. దీన్ని కాపాడుకుంటూ.. మరింతగా బలం పెంచుకునేందుకు పార్టీ ఆలోచిస్తోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు పార్టీలోని హేమాహేమీ నాయకులైన ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క, రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల, షబ్బీర్ అలీలను నియమించింది. అత్యధిక ఓట్లు సాధించాలంటే స్థానిక బలం కూడా అవసరమని భావించిన కాంగ్రెస్.. మాజీ మంత్రి ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతోపాటు, ముత్యం రెడ్డి సానుభూతి ఓట్లు కూడా తోడవుతాయని లెక్కలు వేస్తున్నారు.
సత్తా చాటేందుకు బీజేపీ యత్నం
ఈ ఎన్నికను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. సత్తా చాటేందుకు ఉవ్వీళ్లూరుతోంది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు దూకుడు పెం చారు. ముమ్మరంగా ప్రచారం నిర్వహి స్తున్నారు. ఈ ఎన్నికలపై ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏడు మండలాలకు పలువురు ముఖ్య నాయకులను ఇన్‌చార్జిలుగా నియమించారు. పలు మార్లు సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రచారం చేయడం, అవసరమైతే మోదీ చరిష్మాను కూడా ఉపయోగించి అధిక శాతం ఓట్లు సాధించేలా వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment