మూడు వ్యవస్థలూ సమన్వయంతో ముందుకు | All three systems move forward in harmony | Sakshi
Sakshi News home page

మూడు వ్యవస్థలూ సమన్వయంతో ముందుకు

Published Sat, Aug 26 2023 3:39 AM | Last Updated on Sat, Aug 26 2023 3:39 AM

All three systems move forward in harmony - Sakshi

వేమూరు:  ప్రజా ప్రయోజనాలు, సంక్షేమమే లక్ష్యంగా వలంటీర్లు, గృహ సారథులు, జగనన్న సచివాలయ కన్వినర్లు సమన్వయంతో పనిచేయాలని వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, దక్షిణ కోస్తా జిల్లాల పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌  విజయసాయిరెడ్డి సూచించారు. మూడు వ్యవస్థలూ సంక్షేమ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం వలివేరులో మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులతో కలసి శుక్రవారంనిర్వహించిన సమావేశంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.

వలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వినర్లు నుంచి సలహాలు, సూచనలను స్వీకరించి సందేహాలను నివృత్తి చేశారు. గృహ సారథులకు ఇన్సూరెన్స్‌తోపాటు ఏ విధంగా న్యాయం చేయాలనే అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తమ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో  87%కి పైగా గృహాలు ప్రభుత్వం నుంచి ఏదో ఒక రూపంలో లబ్ధి పొందుతున్నాయని చెప్పారు.

మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని, పార్లమెంట్‌లో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టిందని చెప్పారు. గ్రామస్థాయి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే దిశగా సీఎం జగన్‌ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను సీఎం జగన్‌ అందచేస్తున్నారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేసేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయని ఎంపీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు.
 
దిండ్డుపాలెం గ్రామాభివృద్ధికి రూ.25 లక్షల గ్రాంట్‌ 

చుండూరు మండలం దిండ్డుపాలెం గ్రామంలో డ్రైనేజీ పనుల నిమిత్తం తన ఎంపీ లాడ్స్‌ నిధుల నుంచి రూ.25 లక్షలు గ్రాంట్‌ను  మంజూరు చేస్తున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. గ్రామానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి మేరుగు నాగార్జున, సర్పంచ్‌ భగవద్గీత కోరడంతో ఈమేరకు ఆయన సానుకూలంగా స్పందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement