
చింతా అనురాధ, ఎంపీ, అమలాపురం
అమలాపురం టౌన్: దళిత సమస్యలు ఎప్పుడు ఉత్పన్నమైనా మాజీ ఎంపీ హర్షకుమార్ తన స్వలాభానికే ఉపయోగించుకుంటున్నారని అమలాపురం ఎంపీ చింతా అనురాధ పేర్కొన్నారు. దళితులు అధికంగా ఉన్న అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఆయన దళితులకు ఏం చేశారో ప్రజలకు తెలుసని ఆమె విమర్శించారు. అమలాపురంలో అనురాధ శుక్రవారం సాయంత్రం ‘సాక్షి’తో మాట్లాడారు. సీతానగరం పోలీసు స్టేషన్‌లో జరిగిన సంఘటన అత్యంత విచారకరమని, తమ ప్రభుత్వం తొలి నుంచీ ఖండిస్తూనే ఉందని గుర్తు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, డీజీపీ సవాంగ్‌లు స్పందించి బాధ్యులపై తక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఈ విషయంలో హర్షకుమార్ వాడిన పదజాలం, ప్రదర్శించిన ఆవేశం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అని ఆమె ప్రశ్నించారు.(‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’)
దళితుల మీద ఆయన చేసిన విమర్శలు, వ్యాఖ్యలు ఓ దళితుడిగా ఆయనకూ వర్తిస్తాయని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో దళితుల గురించి ఆయన చెప్పిన మాటలు ఎంత సత్య దూరమో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిసారీ మీరు అనుసరిస్తున్న తీరును...మీ చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. జరిగిన ఘటనను వైఎస్సార్ సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ముక్త కంఠంతో ఖండించారని గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నదే దళితుల కోరికన్నారు. చదువుకున్న వాళ్లం.. ప్రజాప్రతినిధులం.. మన పదజాలం, ప్రవర్తన ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ విషయాన్ని హర్షకుమార్ విజ్ఞతకే... ఆయన మనః సాక్షికే వదిలేస్తున్నానని ఎంపీ అనురాధ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన నిరాధార వ్యాఖ్యలను హర్షకుమార్ వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.