సాక్షి, తాడేపల్లి: టీడీపీకి పట్టిన శని నారా లోకేష్. చంద్రబాబు అరెస్ట్‌తో నందమూరి హరికృష్ణ ఆత్మకూడా శాంతిస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోగ్యంపై నాటకం ఆడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, మంత్రి అంబటి రాంబాబు గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు అరెస్ట్‌తో కలత చెంది ఎవరూ చనిపోలేదు. చంద్రబాబుకు జైలులో పటిష్ట భద్రత ఉంది. ఆధారాలతో సహా దొరికిపోయిన దొంగ చంద్రబాబు. నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అనే పేరుతో యాత్ర చేయబోతున్నారట. నిజంగానే నిజం గెలవాలనే జనం కోరుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి నిజాలను పాతాళంలోకి తొక్కేశారు. వ్యవస్థలను మ్యానేజ్ చేసేవారు. ఇప్పుడు నిజం గెలుస్తున్నందునే చంద్రబాబు జైల్లో ఉన్నారు. నిజం గెలవాలని కోరుకునేవారు 17A పట్టుకునే ఎందుకు తిరుగుతున్నారు?. నిజాన్ని ఓడించాలనే మీ ప్రయత్నం ఓడిపోతూనే ఉంది.
బాలకృష్ణ ఏమయ్యాడు?..
చంద్రబాబు మోసాలు, అన్యాయాలు చేసే మనిషి. ఆయన జైలుకు వెళ్తే గుండెలు పగిలి జనం చచ్చిపోయారని కట్టుకథలు అల్లారు. చంద్రబాబు జైలుకు వెళ్లాక ఎన్టీఆర్, హరికృష్ణ, వంగవీటి రంగా, కందుకూరు, గుంటూరు సభలో చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయి. చంద్రబాబు జైల్లో నుండి కూడా కుట్రలు చేస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని బాలకృష్ణ అన్నారు. మరి బాలకృష్ణ కాకుండా ఇప్పుడు భువనేశ్వరి వెళ్లాలనుకోవడం ఏంటి?. ఇది ములాఖత్‌లో జరిగిన కుట్ర కాదా?. నారావారి చేతిలో నుండి పార్టీ నందమూరి వారి చేతిలోకి వెళ్తుందనే భయం కాదా?.
తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు చంద్రబాబు ఏసీబీ కోర్టులో చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. టీడీపీకి, నారా వారి కుటుంబానికి భవిష్యత్తు లేదు. అలాంటి వారు భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మళ్ళీ తిరుగుతారంట. క్వాష్ రాదనీ, బెయిల్ రాదనీ వారికి అర్థం అయింది. అందుకే ఆరోగ్య సమస్యలు అంటూ హడావుడి చేశారు. చంద్రబాబు ఉన్నది జ్యడీషియల్ రిమాండ్‌లో.. కోర్టు చెప్పిందే అధికారులు చేస్తారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి చెబితే అధికారులు వినరు.
టీడీపీ డ్రామాలను ప్రజలు నమ్మరు..
టీడీపీకి పట్టిన శని నారా లోకేష్. ఆయన వచ్చాకే టీడీపీ భ్రష్టు పట్టింది. లాయర్ల ములాఖత్‌లు ఐదుసార్లు కావాలన్నా కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవచ్చు. కోర్టు చెప్పిందే ఫైనల్. టీడీపీ నేతలు గవర్నర్‌ను కలవటం పొలిటికల్ డ్రామా. లోకేష్ వెళ్లి అమిత్ షాని కలిస్తే కోర్టుల నిర్ణయాలు జోక్యం చేసుకుంటారా?. టీడీపీ వారు ఎన్ని డ్రామాలు చేసినా జనం నమ్మరు. అన్ని ఆధారాలతో కేసు బలంగా ఉంది. చంద్రబాబు కేసు నుండి తప్పించుకోలేరు.
పవన్ కల్యాణ్‌కు కౌంటర్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆలోచన లేదు, ఆలోచనా విధానం లేదు. జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయా? లేదా? అనే డౌట్ చాలాకాలం ఉంది. తెలంగాణలో టీడీపీతో ఎందుకు కలవటం లేదు?. ఏపీలో మళ్ళీ చంద్రబాబుతో పొత్తు ఏంటి?. పవన్ రాజకీయాలకు పనికిరారు. నిజజీవితంలో చేసినట్టే ఒకరితో ఉంటూ ఇంకొకరితో పొత్తు పెట్టుకోవటం ఏంటి?. చంద్రబాబును అరెస్టు చేయటంపై అమిత్ షాతో మాట్లాడతానని చెప్పిన పవన్ ఏమయ్యారు? అంటూ ప్రశ్నలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment