సాక్షి, తాడేపల్లి: తుపానుపై ప్రభుత్వం ముందస్తు చర్యలతో తీవ్ర నష్టం తప్పిందని, ప్రాణనష్టం లేకుండా ఆస్తినష్టంతో బయటపడ్డామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతీ సంక్షోభాన్ని అవకాశంగా రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటని దుయ్యబట్టారు.
‘‘నీచమైన ఆలోచనలతో సీఎం జగన్‌పై బురద జల్లుతున్నారు. చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా విపరీతమైన బురద జల్లుతోంది. ఈనాడులో రామోజీరావు చాలా నీచమైన విష ప్రచారం చేస్తున్నారు. రామోజీరావు ఈ వయసులో కూడా శునకానందాన్ని పొందుతున్నాడు. చంద్రబాబులాగా షో చేయడం సీఎం జగన్‌కి తెలియదు’’ అని మంత్రి అంబటి పేర్కొన్నారు.
చంద్రబాబుకి సవాల్ చేస్తున్నా.. తుపాను వచ్చిన సమయంలో మీరిచ్చిన దానికంటే సీఎం జగన్ ఎక్కువగానే పరిహారం అందించారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రైతులకు వచ్చిన కష్టాన్ని తీర్చాలని పనిచేస్తున్న వ్యక్తి సీఎం జగన్. ఈ రాష్ట్రంలో కొత్తవి కట్టింది.. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసింది వైఎస్సార్. ఆయన ప్రారంభించిన వాటిని పూర్తి చేయాలని భావిస్తున్న వ్యక్తి సీఎం జగన్. అవుకు టన్నెల్‌ను పూర్తి చేసింది సీఎం జగన్. వెలిగొండ టన్నెల్ పూర్తిచేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తాం’’ అని మంత్రి అంబటి చెప్పారు.
‘‘తెలుగుదేశం అలసత్వం వల్లే గుండ్లకమ్మకు ఈ దుస్థితి. అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని ఆలోచించాలి. టీడీపీ సమయంలోనే గుండ్లకమ్మ రిపేర్లు చేయాలని డ్యామ్ సేఫ్టీ సూచించింది. రూ. 5 కోట్లు ఖర్చు చేసి తూతూ మంత్రం చర్యలు చేపట్టి వదిలేశారు. రూ.5 కోట్లతో ఆరోజే సక్రమంగా రిపేర్లుచేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. యుద్ధప్రాతిపదికన స్టాపేజ్ పెట్టి నీటిని నిల్వ చేస్తున్నాం. గుండ్లకమ్మ విషయంలో టీడీపీ చేసిన పాపాన్ని మేం మోయాల్సి వస్తోంది’’ అని మంత్రి పేర్కొన్నారు.
‘‘చంద్రబాబు, లోకేష్, పవన్‌కు ఇక్కడ ఇల్లు.. అడ్రస్ లేదు. ఇక్కడ కొచ్చి రాజకీయం చేసి...ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్తారు. చంద్రబాబు చేతిలో పసుపు జెండా లేదు. ఎవరికి కావాలంటే వారి చేతిలో పసుపు జెండా ఉంది. తెలంగాణలో 8 చోట్ల పోటీచేస్తే జనసేనకు ఒక్క చోట మాత్రమే డిపాజిట్లు వచ్చాయి. మిగిలిన చోట్ల బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు. తన మీటింగ్‌లకు జనం వస్తారు కానీ ఓట్లు వేయరని పవన్ వాస్తవం గ్రహించాడు. తెలంగాణలో అదే జరిగింది’’ అని మంత్రి చెప్పారు.
ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రధానమైన క్యాన్సర్ గడ్డ. ఇప్పుడు తెలుగుదేశం పక్కన జనసేన క్యాన్సర్ గడ్డ వచ్చి చేరుతుంది. తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా.. పోయినా మాకు ఎలాంటి ఇంట్రస్ట్ లేదు. తెలంగాణలో మా పార్టీ లేదు. ఏపీలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. టీడీపీ, జనసేన పార్టీలది అపవిత్ర కలయిక. తెలంగాణలో ఎందుకు కలిసి పోటీ చేయలేదు. ఏపీలో ఎందుకు కలిసి పోటీ చేస్తున్నారో సమాధానం చెప్పి ప్రజలను ఓటడగాలి. ఎంత మంది కలిసొచ్చినా మళ్లీ వైఎస్ జగనే సీఎం’’ అని మంత్రి అంబటి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్‌మెయిల్?
Comments
Please login to add a commentAdd a comment