Ambati Rambabu Fires On Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

బాబు కమీషన్ల కక్కుర్తే పోలవరానికి శాపం 

Published Sun, Jul 30 2023 4:51 AM | Last Updated on Mon, Jul 31 2023 7:22 PM

Ambati Rambabu fires on Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : కమీషన్లు కాజేయాలనే దుర్బుద్ధితోనే 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా పనులు చేపట్టి, పోలవరం ప్రాజెక్టును ముంచేశారని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదంటే.. 2022 నాటికే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలవ­రాన్ని పూర్తి చేసేవారని పునరుద్ఘాటించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన పోలవరం ప్రాజెక్టు పనుల­పై ప్రత్యేకంగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

టీడీపీ సర్కార్‌ తప్పిదాలను ఎత్తిచూ­పుతూ.. చంద్రబాబు చేసిన విమర్శ­లను ఆధారాలతో తిప్పికొడుతూ.. ప్రణాళికా­బద్ధంగా పనులు చేపట్టి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాజె­క్టును పూర్తి చేస్తున్న తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు.  రాజకీ­యా­ల్లో తనను మించిన మహా­నటుడు లేరని చంద్రబాబు నిరూపించుకున్నారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి మూడు రోజుల­పాటు నవరసాలు పండించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నటన­కు ఆస్కార్‌ ఇచ్చినా తప్పు లేదన్నారు.

పోలవ­రాన్ని 2018 నాటికే పూర్తి చేసి.. గ్రావిటీపై ఆయక­ట్టుకు నీళ్లందిస్తానని చంద్రబాబు శాసన­సభ సాక్షిగా హామీ ఇచ్చారు(ఆ వీడియోను ప్రదర్శిస్తూ). నాటి మంత్రి దేవినేని ఉమా కూడా 2018 నాటికే పూర్తి చేస్తామని సవాల్‌ చేశారు. కానీ ఎందుకు పూర్తి చేయలేకపోయా­రని ప్రశ్నిస్తుంటే ఇద్దరూ నోరు మెదపడం లేదు. పోలవరానికి పట్టిన శని, పీడ, చీడ చంద్రబాబే’ అని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో మంత్రి అంబటి ఇంకా ఏం చెప్పారంటే..

డయాఫ్రమ్‌ వాల్‌ విధ్వంసం నిర్వాకం చంద్రబాబుదే
♦ పోలవరం ప్రాజెక్టు ఈసీఆర్‌ఎఫ్‌(ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌) డ్యామ్‌ పునాదికి డయాఫ్రమ్‌ వాల్‌ అత్యంత కీలకం. గోదా వరి ప్రవాహ దిశను కృత్రిమంగా మళ్లించేలా అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, పైలట్‌ ఛానల్‌.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేశాకే డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలి. కానీ.. ప్రాజెక్టు ప్రొటోకా­ల్‌ను చంద్రబాబు తుంగలో తొక్కి, గోదావరి ప్రవాహ దిశను మళ్లించకుండానే బావర్‌ కంపెనీతో రూ.400 కోట్లు వెచ్చించి డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించేశారు.

స్పిల్‌ వేను పునాది స్థాయిలో వదిలేసి.. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను చేపట్టి.. వాటిని పూర్తి చేయలేక.. వాటికి ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి చంద్రబాబు చెతులెత్తేశారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేశాక జూన్‌ నాలుగో వారంలో వరద వచ్చింది.

ఆ ప్రవాహానికి ఎగువ కాఫర్‌ డ్యామ్‌ అడ్డంకిగా మారడంతో.. దానికి ఇరువైపులా వదిలిన ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతం కోతకు గురై నాలుగు చోట్ల భారీ అగాధాలు(స్కవర్స్‌) ఏర్పడ్డాయి. ఈ విధ్వంసానికి బాధ్యత ఎవరిది? ఇది చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదం కాదా?

♦ స్పిల్‌ వే పూర్తి కాకుండానే.. రెండు పియర్స్‌ మధ్య ఇనుప రేకు పెట్టి.. దాన్నే గేటుగా చిత్రీకరిస్తూ.. ప్రాజెక్టును పూర్తి చేసినట్లు రూ.83 కోట్లు వెచ్చించి బస్సుల్లో జనాన్ని తీసుకెళ్లి ‘జయము జయము చంద్రన్న’ అంటూ చంద్రబాబు భజన చేయించుకున్నారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా?

కేంద్రమే కట్టాల్సిన ప్రాజెక్టు పోలవరం 
♦ మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును విభజన చట్టంలో సెక్షన్‌ 90 ప్రకారం వంద శాతం వ్యయాన్ని భరించి తామే పూర్తి చేస్తామని కేంద్రం అంగీకరించింది. అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఎందుకు తీసుకున్నావని 15 నెలలుగా ప్రశ్నిస్తుంటే చంద్రబాబు సమాధానం చెప్పడం లేదు. కమీషన్లు కాజేయాలన్న దుర్బుద్ధితోనే పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నారు.

 2016 సెప్టెంబర్‌ 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లతోనే పూర్తి చేయడానికి చంద్రబాబు అంగీకరించారు. వాస్తవంగా 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ. 55,656.87 కోట్లు. కానీ 2013–14 ధరలతోనే ప్రాజెక్టు ను పూర్తి చేస్తానని కేంద్రం వద్ద అంగీకరించిన చంద్రబాబు.. 2016–17 ధరలతో ‘ఈనాడు’ రామోజీరావు బంధువుకు చెందిన నవయుగకు కాంట్రాక్టు పనులను నామినేషన్‌ పై కట్టబె­ట్టారు. ఇదంతా కమీషన్ల కోసమే అని స్పష్టమవుతోంది. అందుకే ప్రధాని మాదీ.. ఈ ప్రాజెక్టును బాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని చెప్పిన విషయం తెలిసిందే. 

శరవేగంగా పూర్తి చేస్తుంటే ఎందుకంత కడుపుమంట? 
♦ 
వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక చంద్రబాబు తప్పిదాలు సరిదిద్దుతూ అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ వే(48 గేట్లతో సహా), స్పిల్‌ ఛానల్, పైలట్‌ ఛానల్, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసి.. 2021 జూన్‌ 11నే 6.1 కి.మీల పొడవున మళ్లించారు. 
♦ కోతకు గురైన దిగువ కాఫర్‌ డ్యామ్‌ను సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ మార్గదర్శకాల మేరకు జియోమెంబ్రేన్‌ బ్యాగ్‌లలో ఇసుకను నింపి, కోతకు గురైన ప్రాంతంలో వేసి.. వైబ్రో కాంపాక్షన్‌ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 15కు 31.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తయ్యాయి.  ఇప్పుడు డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలి.
 గోదావరి వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ను మార్చి 3, 4 తేదీల్లో సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, ఎన్‌హెచ్‌పీసీ బృందం తనిఖీ చేసి.. దెబ్బతినిందని తేల్చింది. ఇప్పుడు వారి మార్గదర్శకాల మేరకు డయా­ఫ్రమ్‌ వాల్‌ చేపట్టి.. దానిపై ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ను నిర్మించి.. ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు.
 చంద్రబాబు అంగీకరించిన మేరకు 2013–14 ధరల ప్రకారం పోలవరాన్ని పూర్తి చేయడం సాధ్యం కాదని.. 2017–18 ధరల ప్రకారం నిధులు ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని నాలుగేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులకు సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేస్తున్నారు. ఫలితంగా తొలి దశ పూర్తి చేసేందుకు అవసరమైన రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఇటీవల అంగీకరించింది.

పూర్తి స్థాయిలో అంటే 45.72 మీటర్ల మేరకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేంద్రం ఇస్తుంది. ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదని ఇటు సీఎం వైఎస్‌ జగన్‌.. అటు కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి షెకావత్‌ స్పష్టం చేసినా.. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది.


9 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు గురించైనా ఆలోచించావా?
 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును డిజైన్‌ చేసి, టెండర్లు పిలిచి, పూర్తి చేయలేదు.  నువ్వు చెబుతున్నట్లుగా ఎన్టీఆర్‌ డిజైన్‌ చేయించిన గాలేరు–నగరి, హంద్రీ–నీవాను కూడా చేపట్టకుండా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లు వాటికీ వెన్నుపోటు పొడిచి ప్రజలను మోసం చేసింది నువ్వు కాదా బాబూ? 
 మహానేత వైఎస్సార్‌ 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. సముద్రంలో కలుస్తున్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి హంద్రీ–నీవా, గాలేరు–నగరిసహా 84 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టారు. అందులో భాగంగానే పోలవరాన్నీ చేపట్టారు. తాను సీఎంగా ఉన్న ఐదేళ్ల మూడు నెలల్లోనే ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించారు.

పోలవరానికి రూ.4,730.61 కోట్లను వ్యయం చేశారు. మహానేత వైఎస్‌ చేపట్టిన ప్రతి ప్రాజెక్టును.. పోలవరం సహా పూర్తి చేసి, జాతికి అంకితం చేసేది సీఎం వైఎస్‌ జగనే. ఈ నేపథ్యంలో శని చంద్రబాబు ప్రాజెక్టుల వద్దకు వెళ్తానంటున్నారు. ఆయన వెళ్తే వాటికి ఏ ముప్పు వాటిల్లుతుందోననే భయం ప్రజల్లో ఉంది.

ఆంబోతుల వద్దకు ఆవులను పంపిందెవరు? 
చంద్రబాబుకు వయసు పెరిగిన కొద్దీ పైత్యం పెరుగుతోంది. అధికారంలో లేనని.. మళ్లీ ఇక అధికారంలోకి రాలేననే నిరాశ, నిస్పృహలతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. నన్ను ఆంబోతు రాంబాబు అంటూ సంస్కారం లేకుండా దూషిస్తున్నాను. నేనూ  చంద్రబాబును దూషించగలరు.

కానీ నాకు సంస్కారం ఉంది. కానీ.. చంద్రబాబు పదే పదే దూషిస్తున్నారు. ఎన్టీఆర్‌కు అల్లుడివి కాకపోతే చంద్రబాబు సీఎంగా అయ్యేవారా? పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పార్టీని, అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు.. సైకిల్‌ గుర్తును దక్కించుకోవడానికి ఆంబోతుల వద్దకు ఆవులను పంపలేదా? నన్ను చంద్రబాబు ఆంబోతు అన్నప్పుడల్లా.. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే నీచుడు చంద్రబాబు అనే వాస్తవాన్ని కూడా నేను చెబుతాను. 

నేను డ్యాన్స్‌ చేస్తే సంక్రాంతి..పవన్‌ చేస్తే చీకటిరాత్రి  
‘సత్తెనపల్లిలో ఎమ్మెల్యేగా నేను గెలిచి.. ముగ్గుల పోటీ పెట్టి.. సంక్రాంతి రోజున ఆనందతాండవం చేస్తా. డ్యాన్స్‌ నేను చేస్తే సంక్రాంతి.. నువ్వు చేస్తే చీకటిరాత్రి’ అంటూ జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యోక్తులు విసిరారు. ‘బ్రో’ సినిమాలో తనను అనుకరిస్తూ డ్యాన్స్‌ చేసిన నటుడిపై పవన్‌ కళ్యాణ్‌ సెటైర్లు వేసి ఆత్మ సంతృప్తి పొందారన్నారు. పవన్‌ కళ్యాణ్‌ది శునకానందమేనన్నారు.

తాను ఎవరి వద్ద ప్యాకేజీలు తీసుకుని డ్యాన్స్‌లు చేయనని.. చంద్రబాబు వద్ద ప్యాకేజీలు తీసుకుని డ్యాన్స్‌లు చేసే పవన్‌ కళ్యాణ్‌ తన డ్యాన్స్‌పై సెటైర్లు వేసే స్థాయికి దిగజారినందుకు జాలి పడుతు­న్నానని చెప్పారు. రాజకీయంగా తనను ఎదు­ర్కోలేకే, ఎవరో ఖర్చు పెట్టి తీసిన సినిమాలో, పారితోషికం తీసుకుని తనపై పవన్‌ సెటైర్లు వేయడం సిగ్గుచేటన్నారు.

తన అన్న సినిమా నటుడు కాదని..  మామ సీఎంగా పని చేయలేదని.. విద్యార్థి దశ నుంచి నిత్యం ప్రజలతో మమేకమ­వుతూ 1989లో రేపల్లె నుంచి, 2019లో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచానంటూ పవన్‌ కళ్యాణ్, చంద్రబాబులకు చురకలు అంటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement