సాక్షి, అమరావతి: మళ్లీ సీఎంగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన శపథాన్ని నెరవేర్చడమే ధ్యేయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాటి చెప్పుకున్నారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలు, కాపులను చంద్రబాబుకు పవన్ తాకట్టు పెడుతున్నారని చెప్పారు. పవన్ జనసేనను ప్రారంభించింది ప్రజల కోసం కాదని, చంద్రబాబు కోసమేనన్నారు.
2014లో ఎక్కడా పోటీ చేయకుండా టీడీపీకి మద్దతిచ్చారని, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా బాబును అధికారంలోకి తేవడం కోసం కేవలం 137 స్థానాల్లో పోటీచేశారని చెప్పారు. 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటం ద్వారా బాబును సీఎంగా చేయడం కోసం పొత్తుల డ్రామా ఆడుతున్నారన్నారు. చంద్రబాబు కంటే మోసగాడు, తార్పుడుగాడు, పవన్‌కంటే కంటే అబద్ధాలకోరు, అమ్ముడుపోయేవారు దేశంలోనే ఎవరూ ఉండరన్నారు. సీఎం రేసులో లేనని గురువారం అన్న పవన్.. ఫలితాలు వెల్లడయ్యాక సీఎం ఎవరనేది తేలుతుందని శుక్రవారం అనడం అందుకు నిదర్శనమని తెలిపారు. ఆయన అన్నలాగా పార్టీ నడిపే శక్తి లేకపోతే జనసేనను టీడీపీలో విలీనం చెయ్యాలని అన్నారు.
టీడీపీ కాపుల వ్యతిరేక పార్టీ అని చెప్పారు. వంగవీటి రంగాను హత్య చేసి, వేలాది మంది కాపులపై కేసులు బనాయించింది టీడీపీ సర్కారేనని చెప్పారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో ముద్రగడతో సహా వేలాది కాపు యువకులపై అక్రమ కేసులు పెట్టిందీ టీడీపీ సర్కారేనన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆ కేసులను ఎత్తేసి.. కాపు నేస్తం, కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ రాజకీయ ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ఇప్పటికైనా పవన్ వెంట ఉన్న జన సైనికులు, వీర మహిళలు, కాపులు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. కాపులకు అండగా ఉన్న సీఎం వైఎస్ జగన్ వెంట నడుస్తారా లేక అణిచివేసిన చంద్రబాబు వెంట నడుస్తారా అన్నది కాపులు ఆలోచించుకోవాలని చెప్పారు. టీడీపీ, జనసేన కలిసొచ్చినా ప్రజల ఆశీస్సులు, ఆదరణ ఉన్న సీఎం వైఎస్ జగన్ చేతిలో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు.
పోలవరం కాంట్రాక్టర్‌గా వియ్యంకుడిని తప్పించారనే రామోజీ బాధ
పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగకు చంద్రబాబు నామినేషన్‌పై కట్టబెట్టిన రూ. 2,917.78 కోట్ల విలువైన పనులను సీఎం వైఎస్ జగన్ రద్దు చేశారనే అక్కసుతోనే ‘ఈనాడు’లో తప్పుడు కథనాలు అచ్చేçస్తున్నారని మంత్రి అంబటి మండిపడ్డారు. కేంద్రమే కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో నాటి సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ఇవ్వాలని కోరారని చెప్పారు. కేంద్రం షరతులకు తలొగ్గిన చంద్రబాబు ప్రాజెక్టును సంక్షోభంలోకి నెట్టారని చెప్పారు.
ఇది కూడా చదవండి: ‘పాలకుడిని కాదు.. పాలేరునని పవన్ ఒప్పుకున్నాడు’
Comments
Please login to add a commentAdd a comment