Amit Shah Calls All-Party Meeting On June 24 Over Manipur Violence - Sakshi
Sakshi News home page

మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగుకు పిలుపునిచ్చిన కేంద్ర హోంమంత్రి

Published Thu, Jun 22 2023 10:46 AM | Last Updated on Thu, Jun 22 2023 11:25 AM

Amit Shah Calls All Party Meet On June 24 Over Manipur Violence - Sakshi

న్యూఢిల్లీ: మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఎట్టకేలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈశాన్య రాష్ట్రంలో నెలన్నరగా జరుగుతున్న అల్లర్లను అదుపులోకి తెచ్చి రాష్ట్రంలో శాంతిస్థాపనే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది హోంశాఖ. 

ప్రశాంతతకు నెలవైన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మే 3న ఒక్కసారిగా భగ్గుమంది. ఇక్కడి జనాభాలో అత్యధికులు మెయిటీ, కుకీ తేగల మధ్య వైరం తారాస్థాయిలో రాజుకుంది. రెండు వర్గాలు పరస్పర దాడులు చేసుకుంటూ సృష్టించిన బీభత్సంలో అనేకమంది సామాన్యుల జీవితాలు చితికిపోయాయి. ఈ అల్లర్ల కారణంగా 98 మంది మృతిచెందగా భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది.  

దీంతో ఉలిక్కిపడిన కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సాయంతో సైనిక బలగాలను, పోలీసులను మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పర్యటించి, రెండు వర్గాల మధ్య సంధిని కుదిర్చి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. పరిస్థితి సద్దుమణిగిందనుకుంటున్నంతలోనే మళ్ళీ నిప్పు రాజుకుంది.

మరోసారి అల్లర్లు చెలరేగడంతో 9 మంది స్థానిక ఎమ్మెల్యేలు బైరెన్ సింగ్ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదని తేల్చి చెప్పేశారు. ఈ మేరకు ప్రధానమంత్రికి ఒక లేఖను రాస్తూ.. ఇక్కడి ప్రజల నమ్మకాన్ని చూరగొనాలంటే మొదట ప్రభుత్వం చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని, పరిపాలనా విధానంలో మార్పులు చేయాలని వారు తెలిపారు. ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మెయిటీ తెగకు చెందినవారే.

దీంతో కేంద్ర హోంశాఖకు అన్నివైపుల నుండి ఒత్తిడి అధికమవడంతో ఆలస్యం చేయకుండా మణిపూర్లో శాంతిస్థాపనే ప్రధాన ఉద్దేశ్యంగా అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశం జూన్ 24న న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుందని ఈ ప్రకటనలో తెలిపింది హోంశాఖ.       

ఇది కూడా చదవండి: భారత ప్రధానిపై హాలీవుడ్ నటుడి ప్రశంసలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement