
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య సంబంధాలు జాతీయ స్థాయిలో ఒకలా, రాష్ట్రంలో మరోలా ఉంటున్నాయా? అనే విషయమై ప్రజలతో పాటు పార్టీ కేడర్‌లో నెలకొన్న అనుమానాలపై బీజేపీ అగ్ర నాయకత్వం స్పష్టత ఇవ్వనుందా? ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్న ప్రచారానికి తెరదించనుందా? అంటే అవుననే బీజేపీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. ఈనెల 17న నిర్మల్‌లో జరిగే బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఈ సభా వేదికపై నుంచి టీఆర్‌ఎస్‌తో దోస్తీ లేదనే విషయాన్ని ఖరాకండీగా చెప్పనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో మారిన పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే సందేశాన్ని స్పష్టంగా ఇవ్వనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు.
అయోమయానికి తెరదించేలా..: సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ పెద్దలు, కేంద్ర మంత్రులను కలిసినప్పుడు, రాష్ట్రానికి కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రశంసలు కురిపిస్తుండటంతో.. టీఆర్‌ఎస్‌కు బీజేపీ మిత్రపక్షమే అన్న అనుమానం ప్రజల్లో, బీజేపీ కేడర్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్వహణ, వి«ధులు, రాష్ట్రాల మధ్య సంబంధాలు, రాజకీయాలు వేర్వేరని బీజేపీ జాతీయ నాయకత్వం పలుమార్లు స్పష్టం చేసినా రాష్ట్ర కేడర్‌లో అయోమయం పూర్తిగా తొలగని పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రులు అధికార పార్టీపై సానుకూల దృక్పథంతో మాట్లాడడాన్ని శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ అసమర్థ విధానాలు, అవినీతిపై పార్టీ పోరాడుతుంటే.. కేంద్ర మంత్రులు పోరాటాన్ని నీరుగారుస్తున్నారనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇలాంటి వాటిన్నింటిపై శుక్రవారం నిర్మల్‌లో జరిగే సభలో అమిత్ షా స్పష్టత ఇవ్వనున్నట్లు పార్టీలు వర్గాలు చెబుతున్నాయి.
రాజీ పడకుండా పోరాడండి
బీజేపీ రాష్ట్ర నేతల కథనం ప్రకారం.. టీఆర్‌ఎస్‌తో జాతీయ స్థాయిలో స్నేహంగా మెలగడం వంటిదేదీ లేదని, వచ్చే రెండున్నరేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలపై రాజీ లేకుండా పోరాడి విజయం సాధించేలా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని అమిత్ షా చెప్పనున్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ యంత్రాంగమంతా ఒక్కతాటిపై నిలిచి గట్టిగా పోరాడాలని, అందుకు జాతీయ పార్టీ పూర్తి సహాయ సహకారాలు, మద్దతు అందిస్తుందనే భరోసా కల్పించనున్నారు.
సెంటిమెంట్‌ను సద్వినియోగం చేసుకునేలా..
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ 1997 నుంచి బీజేపీ వివిధ రూపాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. 2014లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఎంఐఎంతో ఆ పార్టీ పొత్తును ఎండగడుతూ ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది. అదీగాక విపక్షంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన టీఆర్‌ఎస్, పాలనాపగ్గాలు చేపట్టాక దానిని నిర్వహించకపోవడాన్ని ఎత్తిచూపుతూ బీజేపీ తన పోరును మరింత ఉధృతం చేసింది.
మెజారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకే..
తాజాగా రాష్ట్రంలోని మెజారీటీ వర్గ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు, ఓటింగ్‌లో విభజన తెచ్చేందుకు హైదరాబాద్ విమోచన సెంటిమెంట్‌ను బలంగా ఉపయోగించుకోవాలని బీజేపీ అధినాయకత్వం భావించింది. ఒకవైపు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజాసంగ్రామ యాత్ర’ ద్వారా అటు కేడర్‌ను బలోపేతం చేసేందుకు, ప్రజల దష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్ సర్కార్‌పై ఘాటైన విమర్శలు, ఆరోపణలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత సానుకూల వాతావరణం ఏర్పడిందని భావిస్తున్న అగ్ర నాయకత్వం.. నేరుగా రంగంలోకి దిగింది. టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ విమోచనను అధికారికంగా నిర్వహించని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో ఎండగట్టడం ద్వారా పార్టీ వైఖరిని అమిత్ షా సుస్పష్టం చేయనున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
జాతీయ భావం పెంపొందించేందుకే..!
అయితే అఖండ భారత్‌ను కోరుకోవడంతో పాటు దేశ విభజనను పూర్వపు జనసంఘ్ గట్టిగా వ్యతిరేకించినందున, ‘హైదరాబాద్ విమోచన’తోనే భారత్‌కు సమగ్ర, సంపూర్ణ ముఖచిత్రం వచ్చినందున.. ఇది సైద్ధాంతికంగా తమ పార్టీకి సంబంధించిన అంశంగా మారిందని బీజేపీ ముఖ్యనేత ఒకరు సాక్షితో అన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ విమోచన దినోత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దీనికి రాజకీయాలతో సంబంధం లేదని, సైద్ధాంతిక అంశాలతోనే ఈ అంశంపై పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజల్లో జాతీయవాద భావాలు వేళ్లూనుకునేందుకు ఈ సభను నిర్వహిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment