సాక్షి, గుంటూరు: తాము అధికారంలో ఉండగా ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పరు. మంచి చేస్తుంటే చూసి ఓర్చుకోలేరు. గత 58 నెలల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను ఏరకంగా బద్నాం చేయాలి? అనే ఆలోచనతోనే కుట్రలు పన్నుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ తమ అసత్య ప్రచారాల మోతాదును ఒక్కసారిగా పెంచేశారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఈ కంటెయినర్ ఎందుకొచ్చింది? ఏం తెచ్చింది ? అంటూ ఈనాడు తాజాగా ఓ కథనం ప్రచురించింది. వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి, అలాగే బయటకు వచ్చిందని, భద్రతా సిబ్బంది వద్ద నమోదు కాని వాహన వివరాలంటూ.. రకరకాల డైరెక్షన్‌లలో కంటెయినర్‌ను హైలెట్ చేస్తూ ఓ గాలి వార్త రాసేసింది. ఇంకేం ఐ-టీడీపీ సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. తమకు చెందిన అకౌంట్లతో ఏవేవో ట్వీట్లు వేయించింది.
దీనికి తోడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు.. ‘‘నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్ ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్ సంగతేంటి?’’ అంటూ ఓ ట్వీట్ కూడా వేశారు. దానికి ఆ ఈనాడు పేపర్ కట్టింగ్ క్లిప్పులను జత చేశారు.
అయితే.. బస్సుయాత్రకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దారిలో ఆహారాన్ని తయారుచేసుకునే పాంట్రీ వాహనం అది. నేటి నుంచి జరగబోయే మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో.. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వంటసామానులు తీసుకు వచ్చింది ఆ పాంట్రీవాహనం.
ఏపీ16జడ్ 0363 నంబరుతో వచ్చిన ఈ వాహనంపై పోలీసు స్టిక్కరు ఉంది. పైగా ఈ ఉదయం ఆ వాహనం ఆళ్లగడ్డకు సైతం చేరుకుంది. అసలు అదేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా.. అత్యుత్సాహంతో ఆ కంటెయినర్ వాహనం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎందుకు వచ్చింది, ఏదో తెచ్చిందంటూ నిస్సిగ్గుగా రాతలు రాయించారు రామోజీ రావు.
ఈ క్రమంలో.. క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ నుంచి ఈటీవీ ప్రతినిధి మకాం వేసిన దృశ్యాలు కనిపించాయి. ఆ పాంట్రీ వాహనం విజువల్స్, ఫోటోలు తీసినట్టు సీసీటీవీ పుటేజీ ద్వారా క్యాంపు కార్యాలయ భద్రతా సిబ్బంది గుర్తించారు. అనుమతి లేకుండా చిత్రీకరించడమే కాకుండా... సదరు పోటోలను, వీడియోను వాడుకుని.. దురుద్ధేశపూర్వకంగా తప్పుడు రాతలు రాసిన ఈటీవీపై చర్యలకు అధికారులు ఇప్పుడు సిద్ధం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment